బొబ్బలపై రౌడీషీట్‌ను తొలగించాలి
● నగరంలో శాంతిభద్రతలను
పరిరక్షించాలి
● ఎస్పీకి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, ఆనం వినతి
నెల్లూరు(క్రైమ్): వైఎస్సార్‌సీపీ నగరాధ్యక్షుడు, కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్‌యాదవ్‌పై అన్యాయంగా పెట్టిన రౌడీషీట్‌ను తొలగించాలని, నెల్లూరు నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నగర నియోజకవర్గ సమన్వయకర్త పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి ఎస్పీ అజిత వేజెండ్లను కోరారు. ఈ మేరకు పోలీసు కార్యాలయంలో ఎస్పీకి సోమవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తొలుత ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. నగరంలో పట్టపగలే అల్లరిమూకలు హత్యలకు తెగబడుతున్నారన్నారు. చిన్నచిన్న కారణాలతో క్షణికావేశంలో హత్యలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఆదివారం కొందరు యువకులు సిటీ బస్సుడ్రైవర్, కండక్టర్‌పై బ్లేడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారన్నారు. నగరంలో శాంతిభద్రతల కోసం వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి పోరాటం చేస్తోందన్నారు. బొబ్బల శ్రీనివాస్‌యాదవ్‌పై రాజకీయ కక్షతో రౌడీషీట్ ఓపెన్ చేయడం దారుణమన్నారు. బొబ్బలపై రౌడీషీట్‌ను తొలగించాలని ఎస్పీని కోరగా స్పందించి న్యాయం చేస్తామన్నారని తెలిపారు. కక్ష పూరితంగా ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఉరుకోబోమన్నారు. ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్‌గా, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారన్నారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని పరామర్శ నిమిత్తం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరుకు వచ్చిన సందర్భంగా జరిగిన తోపులాటను సాకు గా చూపిస్తూ బొబ్బల శ్రీనివాస్‌యాదవ్ అక్కడ లేకపోయినా రాజకీయ కక్షతో టీడీపీ నేతలు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రోద్బలంతో దర్గామిట్ట పోలీసుస్టేషన్‌లో రౌడీషీట్ ఓపెన్ చేశారని ఆరోపించారు. రౌడీషీటర్లను పెంచి పోషిస్తున్న ఆఫీసు, నాయకులెవ్వరన్నది ప్రజలందరికీ తెలిసిన విషయమన్నారు. గతంలో నెల్లూరు రాజకీయాల్లో రౌడీగ్యాంగ్‌లు, గంజాయి గ్యాంగ్‌ల ప్రమేయం ఉండేది కాదన్నారు. పదేళ్లుగా దందాలు, సెటిల్‌మెంట్లు, దౌర్జన్యాలు, కార్యకర్తలను భయపెట్టడం, పార్టీలు మారకుంటే కేసులు పెడుతామని బెదిరించడం ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే జరుగుతున్నాయని ఆరోపించారు. మరే ఇతర నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి లేదన్నారు. పెంచలయ్య హత్యకేసులో నిందితులు ఎవరితో అంటకాగుతున్నారన్న విషయం అందరికీ తెలుసన్నారు. రాజకీయాల్లో గంజాయిబ్యాచ్ లు, రౌడీషీటర్లకు, వారికి సహకరిస్తున్న వ్యక్తులకు తావ్వివొద్దని ప్రజలకు మనవి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్‌యాదవ్, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వేలూరు ఉమామహేష్, స్టేట్ జాయింట్ సెక్రటరీ బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


