పిల్లలు పట్టించుకోవడం లేదు
● వృద్ధుల ఆవేదన
● పోలీస్ కార్యాలయంలో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
నెల్లూరు(క్రైమ్): ‘మా పిల్లలు పట్టించుకోవడం లేదు. విచారించి న్యాయం చేయాలి’ అని పలువురు వృద్ధులు కోరారు. నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి 148 మంది తమ సమస్యలపై ఎస్పీ అజితకు వినతిపత్రాలు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె ఆయా ప్రాంత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. చట్టపరిధిలో బాఽధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నెల్లూరు రూరల్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌బీ, పీసీఆర్, మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్లు డి.వెంకటేశ్వరరావు, బి.శ్రీనివాసరెడ్డి, భక్తవత్సలరెడ్డి, టీవీ సుబ్బారావు, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● నేను వృద్ధుడిని. ఆస్తి కోసం నా కుమారుడు సునీల్ ఇబ్బంది పెడుతున్నాడు. ఇంట్లోంచి గెంటేసి తాళం వేశాడని కావలికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
● నా జీవనాధారం కోసం ఉన్న పొలాన్ని సాగు చేసుకోనివ్వకుండా కుమారుడు ఏడుకొండలు ఇబ్బంది పెడుతున్నాడు. విచారించి న్యాయం చేయాలని సంగం ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు కోరారు.
● నా కుమారుడు తిరునాళ్లకు వెళ్లి మరణించాడు. టీపీగూడూరు పోలీస్‌స్టేషన్‌లో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో నీటిలో మునిగి చనిపోయినట్లు తెలిపారు. నా కుమారుడు చనిపోయిన ప్రాంతాల్లో నీటి గుంతల్లేవు. పూర్తి స్థాయిలో విచారించాలని టీపీగూడూరుకు చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు.
● నెల్లూరు రూరల్ మండలానికి చెందిన హేమంత్ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడు. ఇదేమని ప్రశ్నించినందుకు తన తల్లితో కలిసి నాపై దాడి చేశాడని వేదాయపాళేనికి చెందిన ఓ యువతి ఫిర్యాదు చేశారు.
● అనిల్, మరికొంతమంది నాపై గతంలో దాడి చేశారు. నేనిచ్చిన ఫిర్యాదుపై రాపూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. అయినా వారు నన్ను బెదిరిస్తూ, వేధింపులకు గురిచేస్తున్నారని రాపూరుకు చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు.
● నా కుమార్తె గత నెల ఏడో తేదీ నుంచి కనిపించడం లేదు. చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఆమె ఆచూకీ కనుక్కోవాలని చిన్నబజారుకు చెందిన ఓ వ్యక్తి కోరాడు.


