చిన్నా వదిలేసి వెళ్లిపోయావా..
● బస్సు ఢీకొని బాలుడి మృతి
ఇందుకూరుపేట: బాలురిద్దరూ ఉదయం నిద్ర లేచారు. స్కూల్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో అన్న కళ్ల ఎదుటే తమ్ముడు ప్రాణాలు విడిచాడు. ఈ హృదయ విషాదకర ఘటన మండలంలోని గంగప ట్నం గ్రామంలో సోమవారం జరిగింది. గంగప ట్నం పంచాయతీ వేపచెట్టుదిబ్బకు చెందిన పులి మురళి, మనోజకుమారి దంపతులకు ఇద్దరు బాలురు సంతానం. మురళి కూలీ పనులకు వెళ్లేవాడు. సుమారు నాలుగైదు నెలల క్రితం విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. అప్పట్నుంచి పిల్లలు కార్తీక్, కిరణ్ (11)ను తల్లి చూసుకుంటోంది. సైకిల్‌కు పంక్చర్ కావడంతో కిరణ్.. తన అన్న కార్తీక్‌తో కలిసి టైరు తీసుకుని మరో సైకిల్‌పై గంగపట్నం బయలుదేరాడు. ఈ క్రమంలో రాముడుపాళెం నుంచి గంగపట్నం వైపుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి వారిని ఢీకొట్టింది. సైకిల్ తొక్కుతున్న కార్తీక్ పక్కన పడిపోగా కిరణ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై నాగార్జునరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అప్పటి వరకు కళ్లెదుటే ఉన్న కిరణ్ అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లి కన్నీరుమున్నీరుగా రోదించింది. సోదరుడు కార్తీక్ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. కిరణ్ స్థానికంగా ఉన్న గంగపట్నం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. బాలుడి మృతిపట్ల మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంతాపం ప్రకటించారు.


