కారుణ్య నియామకాల ఉత్తర్వుల అందజేత
నెల్లూరు(అర్బన్): వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తూ నలుగురు వ్యక్తులు మరణించారు. వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పిస్తూ కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం కలెక్టరేట్‌లో ఉత్తర్వులు అందజేశారు. షేక్ అమిత్, కె.చందుకు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్‌గా, ఎన్.నానీకి పంచాయతీరాజ్ శాఖలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా, యు.హరీష్‌కుమార్‌కు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌గా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలిచ్చారు. కార్యక్రమంలో కలెక్టరేట్ డీఆర్వో విజయకుమార్, ఏఓ తుమ్మా విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
గొంతుపై కత్తిపెట్టి..
బంగారు నగల చోరీ
వెంకటాచలం: గుర్తుతెలియని వ్యక్తి ఓ మహిళ గొంతుపై కత్తి పెట్టి చంపేస్తానని బెదిరించి బంగారు నగల్ని చోరీ చేసిన ఘటన మండలంలోని తిక్కవరప్పాడు గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన తమలపాకుల సుగుణమ్మ ఇంటి వద్దకు తెల్లావారుజామున 5 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి స్కూటీపై వచ్చి ఆగాడు. ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించి ఆమె గొంతుపై కత్తిపెట్టి అరిస్తే చంపేస్తానన్నాడు. మెడలోని బంగారు సరుడు, ఇంకా ఉంగరం, కమ్మలు లాక్కొని పరారయ్యాడు. సుగుణమ్మ కేకలు వేసి చుట్టుపక్కల నివాసాల వారికి తెలిపింది అనంతరం నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేశారు.


