టీడీపీ నేతల దౌర్జన్యం
● సర్వే చేపట్టిన అధికారులకు బెదిరింపులు
● వెనుదిరిగిన తహసీల్దార్
సాక్షి టాస్క్‌ఫోర్స్: నగరంలో జరుగుతున్న ఆక్రమణలను గుర్తించి, విచారణ చేపట్టేందుకు వెళ్లిన తహసీల్దార్‌ను ఆక్రమణదారులు బెదిరించారు. అడ్డగించడంతో చివరకు వెనుదిరిగారు. 54వ డివిజన్ భగత్‌సింగ్ కాలనీలో కొంతకాలంగా పలువురు టీడీపీ నాయకులు, వారి సానుభూతిపరులు రూ.కోట్ల విలువైన కార్పొరేషన్, ఇరిగేషన్ స్థలాలను ఆక్రమించి కట్టడాలు కట్టి క్రయ, విక్రయాలు చేస్తున్నారని జిల్లా ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులందాయి. దీంతో సోమవారం నెల్లూరు అర్బన్ తహసీల్దార్ షఫీమాలిక్ తన సిబ్బందితో కలిసి కాలనీకి వెళ్లారు. ఆయన, సిబ్బందిని స్థానిక టీడీపీ నాయకులు, వారి సానుభూతిపరులు అడ్డుకున్నారు. గతంలో కూడా సర్వే, విచారణ కోసం వచ్చిన పలు శాఖల అధికారులను కూడా ఇదే విధంగా మహిళల సాయంతో అడ్డగించి బెదిరించిన సందర్భాలున్నాయి. ఈ విషయమై తహసీల్దార్ మాట్లాడుతూ ఆక్రమణలు గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
పొలంలో పడి రైతు మృతి
మనుబోలు: రొంపి దుక్కి దున్నిన పొలంలో ప్రమాదవశాత్తూ పడి ఓ రైతు మృతిచెందిన ఘటన మండలంలోని చెరుకుమూడి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఆలూరు కృష్ణయ్య (60) పొలం గట్టుపై నడిచి వెళ్తూ జారిపడిపోయాడు. ఈ క్రమంలో బోర్లా పడగా ముఖం బురదలో కూరుకుపోయింది. అటుగా వెళుతున్న రైతులు గమనించి చూసేసరికి అప్పటికే ఊపిరి ఆగిపోయింది.


