ముడుపుల మత్తులో జోగుతూ..
జిల్లాలో ఇలా..
నెల్లూరు(టౌన్): విద్యార్థి జీవితాన్ని నిర్ణయించేది ఇంటర్ విద్యే. ఇందులో ఎంత బాగా చదివి.. అంత బాగా విద్యను ఆకళింపు చేసుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవడం సులభమవుతుంది. అయితే ప్రస్తుతం మార్కులు.. ర్యాంకులే పరమావధిగా భావిస్తున్న యాజమాన్యాలు వీటిని ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. రోజుకో రకంగా వ్యవహరిస్తూ తమ సంస్థల పేరు ప్రతిష్టలు పెంచుకునేందుకే పెద్దపీటేస్తున్నాయి.
బయటే రాయించుకోండి..!
ఇంటర్‌లో పాఠ్యాంశాలను చదవడం ఓ ఎత్తయితే.. ఫిజిక్స్, కెమిస్ట్రీ.. బోటనీ.. జువాలజీకి సంబంధించిన రికార్డులు రాయాల్సి ఉండటం మరో చాలెంజ్. దీని ద్వారా సదరు సబ్జెక్టుల్లో మంచి పట్టు సాధించేందుకు అవకాశం ఉంటుంది. గతంలో ఈ వ్యవహారం పక్కాగా సాగేది. అయితే ప్రస్తుతం యాజమాన్యాలు తమ తీరును మార్చుకుంటున్నాయి. రికార్డులను బయటే రాయించుకోవాలంటూ వీరు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో వీటిని రాసే దుకాణాలు, వ్యక్తుల వద్దకు విద్యార్థులు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది.
రసాయనాలా.. అంటే..?
ప్రాక్టికల్స్‌లో ఏయే రసాయనాలు ఉంటాయనే అంశం చాలా మంది విద్యార్థులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇందులో ఏదో ఒక తరహాలో ప్రలోభాలు పెట్టి మార్కులేయించ్చొనే ధీమాతో థియరీపైనే యాజమాన్యాలూ దృష్టి సారిస్తున్నాయి. నైపుణ్యాలు, విలువలతో కూడి విద్యను విస్మరించి.. బట్టీ కొట్టుడు విధానాలకే జై కొడుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 185 జూనియర్ కళాశాలలుండగా.. కార్పొరేట్, ప్రైవేట్‌కు సంబంధించనవే 119 ఉన్నాయి. ఇందులో ఎంపీసీకి సంబంధించి 18 వేలు.. బైపీసీ చదువుతున్న వారు ఏడు వేల మంది ఉన్నారు. మరోవైపు ప్రాక్టికల్స్‌ను ఫిబ్రవరి ఒకటి నుంచి నిర్వహించనున్నామంటూ షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. రికార్డులను డిసెంబర్ నెలాఖరులోపు అందజేయాల్సి ఉంది. ప్రాక్టికల్స్‌లో రికార్డులనూ పరిగణనలోకి తీసుకోనున్నారు. ఫిజిక్స్‌లో 20.. కెమిస్ట్రీలో 35.. బోటనీలో 65.. జువాలజీలో 50 ప్రయోగాలకు సంబంధించి రికార్డులు రాయాల్సి ఉంది. అయితే బయట ఎవరితోనైనా రాయించుకోవాలంటూ యాజమాన్యాలు ప్రోత్సహిస్తున్నాయి. దీంతో విద్యార్థులు సైతం దానికే మొగ్గు చూపాల్సి వస్తోంది.
యాజమాన్యాల అదనపు వసూళ్లు
కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు మాత్రం ప్రాక్టికల్స్ పేరుతో విద్యార్థుల వద్ద రూ.1500 నుంచి రూ.రెండు వేల వరకు వసూలు చేస్తున్నాయి. రికార్డులెవరు రాసినా.. సక్రమంగా లేకపోయినా.. ప్రాక్టికల్స్‌లో మార్కులేయించేందుకు ఈ మొత్తాన్ని తీసుకుంటున్నామని బహి రంగంగానే చెప్తున్నారు.
జూనియర్ కళాశాలలు – 185
విద్యార్థులు – 30 వేల మందికిపైగా
ఎంపీసీ, బైపీసీ – 25 వేల మంది
ఇదే అంశమై వెలసిన బోర్డులు
ఇంటర్ విద్య.. పరీక్షలు ప్రహసనంలా మారుతున్నాయి. ర్యాంకులే పరమావధిగా భావిస్తున్న యాజమాన్యాలు.. విద్యార్థుల్లో నైపుణ్యాలను తీర్చిదిద్దేలా ఏ మాత్రం చొరవ చూపలేకపోతున్నాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలే ఈ ఉదంతాలకు అద్దం పడుతున్నాయి. వాస్తవానికి ఇందులో రికార్డులు రాయడాన్ని పెద్ద ప్రాజెక్టుగా గతంలో భావించేవారు. దీంతో సబ్జెక్టుల్లో ప్రావీణ్యాన్ని సాధించేవారు. అయితే ప్రస్తుతం రికార్డులు అనే అర్థాన్నే సమూలంగా మార్చేశారు. అద్దె ప్రాతిపదికన రికార్డులు రాసేందుకు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బోర్డులు వెలియడం గమనార్హం. మరికొందరు గ్రూపులుగా ఏర్పడి ఒక్కో దానికి ఒక్కో ధరను నిర్ణయించి.. సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది.
సోషల్ మీడియాలో ప్రచారం
ప్రోత్సహిస్తున్న కళాశాలల
నిర్వాహకులు
క్యూ కడుతున్న విద్యార్థులు
ర్యాంకులే తప్ప నైపుణ్యాలపై దృష్టి సారించని యాజమాన్యాలు
ప్రహసనంలా మారిన ఇంటర్ పరీక్షలు
కార్పొరేట్ యాజమాన్యాల ఆగడాలు జిల్లా ఇంటర్ బోర్డు అధికారులకు తెలిసినా, వారి నుంచి ముడుపులు పుచ్చుకొని మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఏ కార్పొరేట్ కళాశాలలోనూ విద్యార్థులకు ప్రాక్టికల్స్ క్లాసులను నిర్వహిస్తున్న పరిస్థితి లేదు. రికార్డులను బయట రాయిస్తున్నారనే విషయం తెలిసినా ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మా దృష్టికొచ్చింది
రికార్డులను బయట రాయిస్తున్నారనే విషయం నా దృష్టికొచ్చింది. ఆయా కళాశాలల నుంచి కొన్ని రికార్డులను తెప్పించి పరిశీలిస్తా. వీటిని విద్యార్థులే స్వయంగా రాయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిని యాజమాన్యాలు ప్రోత్సహించకూడదు. ప్రతి కళాశాలలో ప్రాక్టికల్స్ తరగతులను నిర్వహించేలా చర్యలు చేపట్టాం.
– వరప్రసాద్‌రావు, ఆర్‌ఐఓ
ముడుపుల మత్తులో జోగుతూ..
ముడుపుల మత్తులో జోగుతూ..
ముడుపుల మత్తులో జోగుతూ..


