ఒత్తిడ్ని జయిస్తే విజయమే
నెల్లూరు(అర్బన్): మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే మార్గాలను పాటిస్తూ.. ఒత్తిడ్ని జయిస్తే విద్యార్థులకు విజయం సొంతమవుతుందని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ మాధవి పేర్కొన్నారు. డాక్టర్ కోర్సులో చేరిన ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఎమోషనల్ అసెస్‌మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ బై ఎడ్యుకేటర్ అనే అంశంపై నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సమావేశ మందిరంలో మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వైద్య వృత్తి సేవాభావంతో కూడుకుందని చెప్పారు. డాక్టర్‌గా మారేందుకు విద్యార్థులు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుందన్నారు. సున్నితత్వాన్ని వీడి.. ఏమైనా ఇబ్బందులొస్తే ప్రొఫెసర్లు, సహ విద్యార్థులతో చర్చించాలని సూచించారు. ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. మనోబలానికి అవసరమైన చిట్కాలను బెంగళూరు నుంచి వచ్చిన అధ్యాపకుడు నెల్సన్ తెలియజేశారు. సైకియాట్రీ విభాగ హెచ్‌ఓడీ లక్ష్మీప్రసన్న, వైస్ ప్రిన్సిపల్ మస్తాన్‌బాషా, డాక్టర్లు బెన్హర్, శరత్ తదితరులు పాల్గొన్నారు.


