గ్రామాల్లో సోమిరెడ్డి అవినీతి కంపు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
మనుబోలు: సర్వేపల్లి నియోజకవర్గంలోని గ్రామాల్లో సోమిరెడ్డి అవినీతి కంపు కొడుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని మడమనూరు, చెర్లోపల్లికి గురువారం వచ్చిన ఆయనకు పలు సమస్యలను ప్రజలు తెలియజేశారు. నాట్లేసే సమయం ఆసన్నమైనా యూరి యా అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే వెంటనే బిగించేవారని, అయితే ప్రస్తుతం నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు. దీంతో నారుమడులను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోందంటూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. సోమిరెడ్డి అవినీతి కథలను నియోజకవర్గ ప్రజలు చెప్తుంటే, వినలేక చెవులు మూసుకోవాల్సి వస్తోందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో తాను మంజూరు చేయించిన పనులు.. ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభోత్సవాలు చేయలేక ఆగిపోయిన వాటిని సోమిరెడ్డి ఆయన ఖాతాలో వేసుకోవడం దిగజారుడుతనానికి నిదర్శనమని అభివర్ణించారు. గతంలోనే పూర్తయి, తొమ్మిది నెలలుగా తాగునీటిని అందిస్తున్న వాటర్ ట్యాంకులను ఇప్పుడు ప్రారంభిస్తున్న సోమిరెడ్డిని అందరూ జోకర్‌లా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. అవినీతికి అలవాటు పడిన సోమిరెడ్డిని ప్రశ్నిస్తే, తనకు కొవ్వు పట్టిందంటూ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఆయన అవినీతి, అక్రమాలను ఎదిరిస్తానే తప్ప భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీ నేతలు బుజ్జిరెడ్డి, మారంరెడ్డి ప్రదీప్‌రెడ్డి, బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, దాసరి భాస్కర్‌గౌడ్, కొండూరు రామచంద్రారెడ్డి, జనార్దన్‌రెడ్డి, మంగళపూడి శ్రీనివాసులురెడ్డి, వరదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


