● నత్తనడకన పైప్‌లైన్ వర్కులు
● సర్వీస్ రోడ్డులో తవ్వకాలు
● రోడ్డుపై మట్టిని వదిలేయడంతో సమస్య
● స్తంభిస్తున్న ట్రాఫిక్
నెల్లూరు(బారకాసు): భూగర్భ డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణ పనులు.. గజిబిజిగా మారుతున్నాయి. నత్తనడకన సాగుతుండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రాకపోకలు సాగించే వారు, దుకాణదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. గుంతలు తవ్వి వదిలేయడంతో అసలే ఇరుగ్గా ఉండే సర్వీస్ రోడ్లు మరింత కుచించుకుపోతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభిస్తోంది.
ఆగుతూ.. సాగుతూ..!
నగరంలో 430 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ పనులను రూ.580 కోట్లతో చేపట్టారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర నిధులతో చేపట్టిన ఇవి నేటికీ సాగుతూనే ఉన్నాయి. 400 కిలోమీటర్ల మేర చేపట్టిన ఇవి మరో 30 కిలోమీటర్ల మేర జరగాల్సి ఉంది. కాంట్రాక్టర్‌కు బకాయిల చెల్లింపులో జాప్యం.. ఇలా అనేక అవరోధాలు ఏర్పడుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పనులను ప్రారంభించినా, అవి నత్తనడకన సాగుతున్నాయి. వర్కులు జరిగిన ప్రాంతాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. రహదారులు గుంతలమయం కావడంతో వాహనదారులు ప్రమాదాలకు గురై గాయపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పనులు జరిగిన మారుతినగర్, శ్రీనివాసనగర్, అపోలో హాస్పిటల్ రోడ్డు, పరుచూరువారివీధి తదితర ప్రాంతాల్లోని అంతర్గత రోడ్లు దుర్భరంగా మారాయి.
నిర్మాణమెప్పటికో..?
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరిగిన ప్రాంతాల్లో సిమెంట్ రోడ్డు నిర్మాణం ఎప్పటికి ప్రారంభమవుతుందానని ప్రజలు నిరీక్షిస్తున్నారు. నవాబుపేట, బాలాజీనగర్, మూలాపేట, పప్పులవీధి తదితర ప్రాంతాల్లో ఇంకా చేపట్టాల్సి ఉంది. ఆయా ప్రాంతాల్లో పనులు పూర్తయ్యాకే సిమెంట్ రోడ్డును చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఈ విషయమై పబ్లిక్ హెల్త్ డీఈఈ జానకిరామ్‌ను ఫోన్లో సంప్రదించగా.. యూజీడీ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు యత్నిస్తున్నామని, మరో ఐదారు నెలల్లో కంప్లీట్ చేసి సిమెంట్ రోడ్డును నిర్మించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఇబ్బందికరంగా ఉన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపడతామని బదులిచ్చారు.
ప్రమాదాలు జరుగుతున్నాయి
పరుచూరువారివీధి, అపోలో హాస్పిటల్ మార్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం తవ్వి రోడ్డు నిర్మాణాలు చేపట్టకుండా అలానే వదిలేశారు. దీంతో రాత్రివేళ వాహనాలు అదుపుతప్పి పలువురు గాయపడుతున్నారు. త్వరగా పూర్తి చేసేలా చూడాలి. – సుబ్బారెడ్డి, బంగ్లాతోట
ఉదయం వేళ మరింత ఇబ్బంది
నగరంలోని శ్రీనివాసనగర్, మైపాడు రోడ్డులో యూజీడీ తవ్వకాల పనులతో చాలా ఇబ్బందిగా ఉంటోంది. దీంతో బయటకెళ్లాలంటే ఆలస్యమవుతోంది. అధికారులు స్పందించి త్వరగా పూర్తి చేయాలి.
– మల్లికార్జునరెడ్డి, సత్యనారాయణపురం
భూగర్భ డ్రైనేజీ పనులు గజిబిజి
భూగర్భ డ్రైనేజీ పనులు గజిబిజి


