శ్రీధర్‌రెడ్డి అక్రమాలపై సీబీసీఐడీ విచారణ జరపాలి
నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అక్రమాస్తులపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ డిమాండ్ చేశారు. నగరంలోని జర్నలిస్ట్ భవన్‌లో విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. గతంలో మీ కుటుంబంపై మాట్లాడితే అభ్యంతరం తెలిపారని, అయితే ప్రస్తుతం తమ కుటుంబంపై ఎందుకు మాట్లాడుతున్నారో తెలపాలని ప్రశ్నించారు. తన నాలుకను కోయిస్తారంటున్నారని, దీనికి తాను సిద్ధమని, ప్రాణాలు పోయేంత వరకు మీ దాష్టీకాలను ఎండగడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.
వేల కోట్లు ఎక్కడ్నుంచొచ్చాయి..?
మా తాతలు రాజకీయ నాయకులు కారని.. తండ్రి జమీందార్ కాదని పదేపదే చెప్పే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తనకు ఇన్ని వేల కోట్లు ఎక్కడ్నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మాగుంట లేఅవుట్లో రూ.20 కోట్ల ఇల్లు.. బెంగళూరులో రూ.100 కోట్ల షాపింగ్ మాల్.. హైదరాబాద్‌లో రూ.30 కోట్ల విల్లా ఎలా వచ్చిందో తెలపాలని సవాల్ విసిరారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని అడ్డుపెట్టుకొని రెవెన్యూ, అటవీ భూములు, కాలువల ను ఆక్రమించడం.. మరో బిల్డర్‌ను అడ్డుపెట్టుకొని అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లను కొట్టేసిన విషయం వాస్తవం కాదానని ప్రశ్నించారు. వారెన్ని బిల్డింగులు కడితే అన్ని ఫ్లాట్లు రాసిచ్చిన విషయాన్ని తెలపాలని డిమాండ్ చేశారు. లంబోదర సెంటర్‌లో వసూలు చేసిన రూ.10 కోట్లు ఎటుపోయాయని ప్రశ్నించారు.
ప్రాణాలు పోయినా.. పోరాటం ఆగదు
తమకు రాజకీయ భిక్ష పెట్టామంటున్నారని, అయితే అడుగడుగునా ఇబ్బందులకు గురిచేసింది.. తమపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రచారం చేయించింది వాస్తవం కాదానని ప్రశ్నించారు. నరసింహకొండ వద్ద గ్రావెల్‌ను దోచారని ఆరోపించారు. శ్రీధర్‌రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్‌రెడ్డి చేసిన పాపాలను వెలుగులోకి తెస్తూనే ఉంటామని, తన ప్రాణాలు పోయినా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవ చూపి, ఈ దాష్టీకానికి ముగింపు పలకాలని కోరారు.
ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన
కోటంరెడ్డి సోదరులు
నరసింహకొండలో గ్రావెల్ దోపిడీ
లంబోదర సెంటర్‌లో రూ.పది కోట్లు ఎటుపోయాయి..?
మేయర్ భర్త జయవర్ధన్


