జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
ఉలవపాడు: జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు విద్యార్థులు ఎంపికయ్యారని రామాయపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం లక్ష్మాజీ పేర్కొన్నారు. గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. ఇటీవల వినుకొండలో 69వ స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ మీట్ జరిగిందన్నారు. హ్యామర్ త్రోలో అండర్–17 విభాగంలో ఎస్‌కే ఆసీఫ్, టి.అశ్వని ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. వీరు డిసెంబర్ 10వ తేదీన బిహార్‌లో జరిగే జాతీయ స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ మీట్‌లో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొంటారన్నారు. విద్యార్థులను, పీడీ జీవన్‌కుమార్‌ను ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.
తీరంలో మృతదేహం
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని కృష్ణపట్నం సముద్ర తీరానికి గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. స్థానికులు గురువారం గుర్తించి పోర్టు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీనివాసులురెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయసు సుమారు 45 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. శరీరంపై దుస్తుల్లేవు. నాలుగు రోజుల క్రితం చనిపోయినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతదేహం కుడిచేతికి రబ్బర్ బ్యాండ్ ఉంది. సముద్రపు నీటిలో నానడంతోపాటు చేపలు మృతదేహాన్ని కొరుక్కు తినడంతో గుర్తుపట్టలేని విధంగా ఉంది. కేసు నమోదు చేశారు.


