జీవితాలు విలవిల
సైబర్ వల..
● పోర్టల్ : డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సైబర్‌క్రైమ్.జీఓవీ.ఇన్
తక్షణ ఫిర్యాదుతో బాధితులు కోల్పోయిన డబ్బులు తిరిగి పొందే అవకాశాలున్నాయి.
నెల్లూరు(క్రైమ్): సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని, అత్యాశను ఆసరాగా చేసుకుని నయా మోసాలతో బ్యాంక్ ఖాతాల్లోని నగదును దోచేస్తున్నారు. ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ తరహా మోసాలపై ఫిర్యాదులు అందుతున్నాయి. సైబర్ నేరగాళ్లపై ప్రజలు అవగాహన పెంపొందించుకుని అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం ఇదే ఎక్కువగా..
డిజిటల్ అరెస్ట్‌లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. సైబర్ నేరాల్లో ప్రస్తుతం ఈ తరహా మోసాలే అధికంగా జరుగుతున్నాయి. సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ అధికారుల పేరిట సంపన్న వర్గాలు, విద్యావంతులు, ఉద్యోగులు, వైద్యులు, పిల్లలకు దూరంగా ఉంటున్న తల్లిదండ్రులు తదితరులకు వీడియోకాల్ చేస్తున్నారు. వారు ఆయా డిపార్ట్‌మెంట్ యూనిఫారాల్లో కనిపిస్తారు. పరిసరాలు ఆఫీస్‌ను తలపించేలా చేస్తారు. నిజమైన అధికారులని భ్రమ కల్పిస్తారు. విదేశాల నుంచి వచ్చిన కొరియర్‌లో డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలున్నాయని, విదేశాల నుంచి మీ ఖాతాల్లో రూ.కోట్ల నగదు జమైందని, మీపేరుపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందంటూ నకిలీ పత్రాలను చూపిస్తారు. విచారణ పూర్తయ్యే వరకు ఇంట్లో నుంచి కదలనివ్వకుండా నిర్భందిస్తున్నారు. వివరాలు సేకరిస్తున్నట్లు నటిస్తూ కేసు నుంచి బయట పడాలంటే తాము చెప్పినంత మొత్తాన్ని చెల్లించాలని లేకుంటే అరెస్ట్ తప్పదని కంగారుపెట్టి వారు అడిగినంత ఖాతాల్లో జమయ్యాక వదిలేస్తున్నారు.
మోసాలెన్నో..
● బ్యాంక్ నుంచి ఫోన్ చేసి మీ ఖాతా బ్లాక్ చేశామని చెబుతారు. మళ్లీ ఖాతాను పునః ప్రారంభించాలంటూ వివరాలు సేకరిస్తారు. ఖాతాకు లింకై న ఫోన్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని చెప్పాలని అడుగుతారు. నగదు లావాదేవీలకు సంబంధించిందే కదా అని ఓటీపీ చెప్పగానే క్షణాల్లో ఖాతాల్లోని నగదు మాయమవుతుంది.
● ట్రేడింగ్‌ల్లో పెట్టుబడులు పెట్టండి కళ్లు చెదిరే ఆదాయం పొందండంటూ సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ఆకర్షిస్తారు. నకిలీ వెబ్‌సైట్‌లకు మళ్లిస్తారు. స్కామర్లు తొలుత తక్కువ మొత్తంలో చాలా ఎక్కువ రాబడి వచ్చేలా చేసి మిమ్మల్ని మరింత పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తారు. అనంతరం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించి దోచేస్తారు.
● ఎక్కువమంది ఆన్‌లైన్ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లలో ఫొటోలతో సహా తమ బయోడేటాను నమోదు చేసుకుంటున్నారు. మోసగాళ్లు ఈ వివరాలను తీసుకుని ఫోన్ లేదా ఈ–మెయిల్లో సంప్రదిస్తున్నారు. వధువు లేదా వరుడితో మాటలు కలిపి అవతలి వైపు నుంచి నమ్మకం పొందాక తమ ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఏదో ఒక అవసరం ఉందని చెప్పి అందినకాడికి దోచుకుంటున్నారు. మరికొందరు వరుడులను నమ్మించి ఆన్‌లైన్ ట్రేడింగ్‌ల్లో పెట్టుబడులు పేరిట మోసగిస్తున్నారు.
● ఈ చలానా బకాయిలను వెంటనే చెల్లించాలంటూ ఆర్టీఓ కార్యాలయం పేరిట ఫోన్‌కు ఏపీకే ఫైల్ పంపుతారు. దానిపై క్లిక్ చేయగానే ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసి బ్యాంక్ ఖాతాలోని నగదు కాజేస్తున్నారు.
● బ్యాంక్‌ల పేరిట ఏపీకే ఫైల్స్ రూపంలో వాట్సాప్‌లకు సందేశాలు పంపి, మీ ఆధార్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని లేదంటే ఖాతా క్లోజ్ అవుతుందని పేర్కొంటారు. ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు వెంటనే బ్యాంక్ ఽఆధార్ అప్‌డేట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. ఏపీకే ఫైల్‌ను తెరిచిన వెంటనే ఫోన్ హ్యాక్ అవుతుంది. ఖాతాల్లోని సొమ్మును సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు.
● వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట యువతను లక్ష్యంగా చేసుకుని జాబ్ స్కామర్లు రెచ్చిపోతున్నారు. తక్కువ సమయం, తక్కువ శ్రమతో నెలకు రూ.వేలు సంపాదించే ఉద్యోగాలు తమ వద్ద ఉన్నాయంటూ తరచూ ఆన్‌లైన్‌లో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇవి నమ్మి సంప్రదిస్తే ఫీజుల రూపంలో నగదు కట్టించుకుని తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్లో సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు (ఫైల్)
ఇటీవల జరిగినవి
నెల్లూరు రూరల్ పరిధిలోని వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తకు సీబీఐ అధికారుల పేరిట సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి రూ.23 లక్షల నగదు దోచేశారు.
కావలి పట్టణంలోని ఓ వ్యక్తికి ఆర్టీఓ చలానా పేరుతో ఏపీకే ఫైల్ పంపించి అతని ఖాతాలోని సుమారు రూ.24 లక్షల నగదును కాజేశారు.
నెల్లూరు చైతన్యపురి కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ చేశారు. రూ.1.02 కోట్లను దోచేశారు.
నగరానికి చెందిన ఓ మహిళకు ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో ఆదాయం వస్తుందని నమ్మించి రూ.2.46 కోట్లు పెట్టుబడులు పెట్టించి మోసగించారు.
టెలిగ్రామ్ యాప్‌లో వర్క్ ఫ్రం హోం ద్వారా నగదు సంపాదించవచ్చని నమ్మించి దుత్తలూరు మండలంలోని ఓ వ్యక్తి నుంచి రూ.22 లక్షలు కాజేశారు.
మ్యారేజీ బ్యూరో ద్వారా పరిచయమైన ఇద్దరు యువతులు నెల్లూరు నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకుంటామని నమ్మించి ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరిట రూ.12 లక్షలు దోచేశారు.
సైదాపురానికి చెందిన ఓ వ్యక్తికి ఆధార్‌కార్డు అప్‌డేట్ కాకపోవడంతో నెట్ బ్యాకింగ్ సేవలు నిలిచిపోయాయని ఖాతా సైతం శాశ్వతంగా పనిచేయకుండా పోతుందంటూ సైబర్ నేరగాళ్లు అతని వాట్సాప్ నంబర్‌కు సందేశం పంపారు.
మోసాలు.. ఎన్నో కోణాలు
జిల్లాలో పెరుగుతున్న బాధితుల సంఖ్య
రూ.లక్షల్లో పోగొట్టుకుంటున్న వైనం
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుల వెల్లువ
అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
సైబర్ మోసానికి గురైతే..
ఫోన్ చేయాల్సిన
టోల్‌ఫ్రీ నంబర్ : 1930
జీవితాలు విలవిల


