నిమ్మ ధరలు పతనం
● మాకొద్దంటున్న ఢిల్లీ మార్కెట్ వ్యాపారులు
పొదలకూరు: నిమ్మకాయలను అడిగే వారు లేరు. ఇక్కడి వ్యాపారులు ఎగుమతులు చేస్తామంటే ఢిల్లీ మార్కెట్ వ్యాపారులు వద్దంటున్నారు. దీంతో పూర్తిగా డిమాండ్ పడిపోయి రైతులు ఆవేదన చెందుతున్నారు. నిమ్మపై ఆధారపడి జీవిస్తున్న మెట్టప్రాంత రైతులు ఢీలా పడిపోయారు. రుణాలు తెచ్చుకుని తోటలకు పెట్టుబడులు పెడుతున్న వారు అప్పులు ఎలా తీర్చాలో అర్ధం కావడం లేదని బాధలో ఉన్నారు. ఓవైపు చలికాలం, మరోవైపు పోటీ పెరగడంతో పొదలకూరు, గూడూరు మార్కెట్ల నుంచి కాయలు ఎగుమతి కావడం లేదు. లూజు (బస్తా) రూ.400 నుంచి రూ.600 మాత్రమే ఉంది. కిలో రూ.10 కూడా ధరలు పలకడం లేదని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. పొదలకూరు పరిసర ప్రాంతాల్లో నిమ్మపై జీవిస్తున్న రైతులు సుమారు 2 వేల మంది వరకు ఉంటారు. 5 వేల ఎకరాల్లో తోటలు సాగవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో తోటలు తప్పించి ఇతర వ్యవసాయ పనులు కూడా రైతులకు తెలియదు. పంట మార్పిడికి సైతం విముఖత చూపుతారు. ధరలు పతనం కావడంతో రైతులు దిగులు పడుతున్నారు. తోటల సంఖ్య అధికం కావడంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎగుమతులు పెరగడంతో ఇక్కడి నిమ్మకు క్రమంగా డిమాండ్ తగ్గుతున్నట్టు తెలుస్తోంది.


