క్షణక్షణం.. భయం..భయం
● అల్లూరు రోడ్డుపై రైల్వే వంతెన
నిర్మాణంలో నిర్లక్ష్యం
● తరచూ ప్రమాదాలు
● గంటల తరబడి స్తంభిస్తున్న ట్రాఫిక్
జాతీయ రహదారిపై ఇరుకు దారిలో రాకపోకలు
దగదర్తి: సురక్షిత ప్రయాణమే తమ లక్ష్యమని తరచూ గొప్పలు చెప్పుకొనే ఎన్‌హెచ్‌ఏఐ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. నెల్లూరు నుంచి విజయవాడ వరకు రహదారిని ఆరు వరుసలుగా విస్తరించినా, అల్లూరు రోడ్డు రైల్వే వంతెనను మాత్రం విస్మరించారు. ఫలితంగా ఇక్కడ రెండు లేన్లే ఉండటంతో ఇరుకు రోడ్డుపై వాహనాలు రాకపోకలను సాగించాల్సి వస్తోంది.
తప్పని అగచాట్లు
ఆరు వరుసల రహదారిపై వేగంగా వస్తూ.. ఇక్కడ రెండు లేన్లుగా ఉండటంతో వాహనదారులు తికమకకు గురై ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్నా, సూచిక బోర్డులను మాత్రం ఏర్పాటు చేయడంలేదు. కొన్ని సందర్భాల్లో భారీ వాహనాలు వెళ్తూ చిన్న రహదారిలో ఇరుక్కుపోతూ గంటల తరబడి ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఇక్కడ నిర్మించిన నాలుగు లేన్లపై కొంతకాలం రాకపోకలు జరిగాయి. అయితే భారీ వాహనాల అధిక లోడ్‌తో పాత బ్రిడ్జిపై పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో రైల్వే ట్రాక్‌పై పెను ప్రమాదం సంభవించే అవకాశముందనే ఉద్దేశంతో ఇంజినీరింగ్, రైల్వే అధికారులు పరిశీలించారు. బ్రిడ్జి కూలేందుకు సిద్ధంగా ఉందని, నూతనంగా నిర్మించేంత వరకు రాకపోకలను నిలిపేశారు. ఆపై ధ్వంసం చేసి తొలగించారు. అప్పటి నుంచి నూతన బ్రిడ్జిపై మార్జిన్ కోసం డివైడర్లను ఏర్పాటు చేసి రాకపోకలకు మార్గం సుగుమం చేశారు. అయితే ఇదే ప్రమాదకరంగా పరిణమించింది. సూచికలు, రేడి యం స్టిక్కర్లను ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నూతన బ్రిడ్జిని నిర్మించాల్సి ఉన్నా, మీనమేషాలను లెక్కిస్తున్నారు.
ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదాలు..
● ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఇటీవల ప్రమాదానికి గురైంది.
● బైక్‌పై వెళ్తూ అదుపుతప్పడంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
● బోగోలు మండలం మంగమూరుకు చెందిన యువకుడు బైక్‌పై వెళ్తూ పడి మరణించారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికై నా రైల్వే బ్రిడ్జిని నిర్మించేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
త్వరలోనే టెండర్ల ప్రక్రియ
అల్లూరు రోడ్డుపై వంతెన నిర్మాణ టెండర్ ప్రక్రియ విజయవాడలో జరుగుతోంది. ఇది పూర్తయిన వెంటనే పనులను ప్రారంభిస్తాం. రైల్వే ఇంజినీరింగ్ అధికారులతో కలిసి బ్రిడ్జిని ఇటీవలే పర్యవేక్షించాం. జాతీయ రహదారిపై గుంతలు, ప్రమాద హెచ్చరికలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత టోల్ నిర్వాహకులదే. వారికి తెలియజేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతాం.
– సురేష్‌బాబు, హైవే కన్సల్టెంట్ ఇంజినీరింగ్ అధికారి


