హౌసింగ్ ఉద్యోగుల సమస్యలపై వినతి
నెల్లూరు(అర్బన్): సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ విద్యాసాగర్‌ను హౌసింగ్ ఉద్యోగులు కోరారు. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎంప్లాయ్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు గురువారం నెల్లూరులోని ఎన్జీఓ కార్యాలయంలో విద్యాసాగర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భగా కమిటీ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ ఎన్‌వీఎం మనోజ్‌కుమార్ మాట్లాడుతూ హౌసింగ్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్ పాలసీ అమలు చేసేలా, అందరిలాగే తమ శాఖలోని ఉద్యోగుల వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచేలా ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. జిల్లాలో గృహనిర్మాణ శాఖపై జరిగిన విజిలెన్స్ విచారణలో వాస్తవాలు వెలుగులోకి తెచ్చి ఉద్యోగులపై అభాండాలు వేయకుండా న్యాయం చేసేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో గోపీనాథ్, మురళీమోహన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


