క్రీడారంగ అభివృద్ధికి కృషి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జిల్లాలో క్రీడారంగ అభివృద్ధికి కృషి చేస్తానని నూతన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎం.పాండురంగారావు పేర్కొన్నారు. డీఎస్‌డీఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. 1999లో ఫుట్‌బాల్ కోచ్‌గా నెల్లూరులో చేరానని, 12 సంవత్సరాలు పనిచేశానని చెప్పారు. ఆ సమయంలో శిక్షణ పొందిన పలువురు ప్రస్తుతం పోలీస్, రైల్వే వివిధ శాఖల్లో ఉద్యోగులుగా రాణిస్తున్నారన్నారు. అనంతరం విజయవాడ, గుంటూరు శాప్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేశానన్నారు. అనంతరం నెల్లూరులో ఫుట్‌బాల్ సీనియర్ కోచ్‌గా చేరినట్లు వెల్లడించారు. సబ్ జూనియర్ స్థాయి నుంచి క్రీడాభివృద్ధి సాధించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రోత్సాహంతో క్రీడా సంఘాలు, కోచ్‌లు, సీనియర్ క్రీడాకారుల సహకారంతో క్రీడాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.


