ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన పాలవ్యాన్
● డ్రైవర్ మృతి
ఉలవపాడు: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి పాలవ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్ మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. దేవీ వెనామీ ఫీడ్ తీసుకెళ్లే లారీ గురువారం చాగల్లు – వీరేపల్లి మధ్య జాతీయ రహదారిపై ఆగి ఉంది. ఈ సమయంలో సంతమాగులూరు నుంచి గాయత్రి మిల్క్‌కు చెందిన పాల వాహనం కావలికి వెళ్తూ ఆ లారీని ఢీకొట్టింది. దీంతో మద్దిపాడు మండలం వెల్లంపల్లికి చెందిన డ్రైవర్ రాకొండి దుర్గా మహేష్ (25) వాహనంలోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. మహేష్‌కు వివాహం కాలేదు. భవానీ మాల ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉలవపాడు సీహెచ్‌సీకి తరలించారు. కేసు నమోదు చేశారు.
హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్
నెల్లూరు సిటీ: స్నేహితుడిపై హత్యాయత్నం చేసిన నిందితుడిని నెల్లూరు రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి కథనం మేరకు.. రూరల్‌లోని ములుమూడి గ్రామానికి చెందిన కె.ప్రేమ్‌కుమార్, బీవీనగర్‌కు చెందిన బి.అనిల్‌కుమార్ స్నేహితులు. ఈనెల 2వ తేదీ రాత్రి ప్రేమ్.. అనిల్‌కు ఫోన్ చేసి మరో స్నేహితుడైన సుమంత్ ఫోన్ నంబర్ అడిగాడు. లేదని చెప్పడంతో కోపోద్రిక్తుడైన ప్రేమ్ తీవ్ర పదజాలంతో దూషించాడు. వెంటనే అనిల్ ఇంటికొస్తున్నానని బయలుదేరాడు. అప్పటికే ప్రేమ్ లేకపోవడంతో ఫోన్‌చేసి రమ్మని పిలిచాడు. అతను వెళ్లడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రేమ్ కత్తితో అనిల్‌పై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అరెస్ట్ చేశారు.
బంగారం, వెండి చోరీ
నెల్లూరు(క్రైమ్): ఇంటి యజమాని కింది పోర్షన్‌లో నిద్రిస్తుండగా పైఅంతస్తు గదిలోని బంగారు ఆభరణాలను గుర్తుతెలియని దుండగులు అపహరించుకెళ్లారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బంగ్లాతోటలో రఫీ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతడికి జీ+1 ఇల్లు ఉంది. పైఅంతస్తులో అతను ఉంటుండగా కుటుంబ సభ్యులు కింది పోర్షన్‌లో ఉంటున్నారు. బుధవారం మనుమరాలికి అనారోగ్యంగా ఉండటంతో అతను హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి వచ్చి కింద పోర్షన్‌లో నిద్రపోయాడు. ఈక్రమంలో గుర్తుతెలియని దుండగులు పైఅంతస్తు గది తాళాలు తెరిచి డబ్బాలో దాచి ఉంచిన ఆరు సవర్ల బంగారు ఆభరణాలు, 240 గ్రాముల వెండి వస్తువులు అపహరించుకెళ్లారు. గురువారం చోరీ ఘటనపై బాధితుడు నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వసతి గృహంలో తనిఖీలు
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సాంఘిక సంక్షేమశాఖ డీడీ శోభారాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా చూడాలన్నారు. స్టడీ, యోగా తరగతులు, ట్యూషన్ క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో వసతిగృహ సంక్షేమాధికారి నాగరాజు పాల్గొన్నారు.
రాపూరులో వర్షం
రాపూరు: రాపూరులో గురువారం ఉదయం, సాయంత్రం వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రోడ్లు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బంలు పడ్డారు. వర్షం మేలు చేసిందని నిమ్మ రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన పాలవ్యాన్


