స్కాలర్‌షిప్ పథకం సద్వినియోగానికి పిలుపు
నెల్లూరు రూరల్: మాజీ సైనికులు, కోస్ట్ గార్డ్ మాజీ సిబ్బంది, వారి వితంతువుల పిల్లల ఉన్నత వృత్తి విద్యకు సంబంధించిన ప్రధాని స్కాలర్‌షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవా లని కలెక్టర్ హిమాన్షు శుక్లా పిలుపునిచ్చారు. ఈ మేరకు కలెక్టర్, జిల్లా సైనిక్ బోర్డు చైర్మన్‌ను జిల్లా సైనిక సంక్షేమాధికారి హరికృష్ణ ఆధ్వర్యంలో సైనిక్ బోర్డు సభ్యులు మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. స్కాలర్‌షిప్ పథకంలో భాగంగా బాలురకు రూ.2500.. బాలికలకు రూ.మూడు వేలను ప్రతి నెలా అందజేయనున్నారని చెప్పారు. దీనికి గానూ ఈ నెలాఖరులోపు నమోదు చేసుకోవాలని కోరారు. ఎల్‌ఓసీలో మరణించిన సీతారామపురానికి చెందిన మండ్ల ప్రసాద్‌కు ఎక్స్‌గ్రేషియా, కుటుంబసభ్యులకు కారుణ్య నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను త్వరితగతిన అమలు చేయాలని ఆదేశించారు. మాజీ వింగ్ కమాండర్ వల్లూరు శ్యామ్‌ప్రసాద్, మాజీ హవాల్దార్ కళాధర్, సైనిక్ అసోసియేషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ గడ్డం రత్నయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
స్కూల్ గేమ్స్ హాకీ జట్ల
ఎంపికలు నేడు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): స్కూల్ గేమ్స్ అండర్ – 14, 17 హాకీ బాలబాలికల జిల్లా జట్లను నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ఎంపిక చేయనున్నామని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు రమణయ్య, దేవిక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు హాజరుకావాలని కోరారు.
ఏసీబీ తనిఖీలతో
బెంబేలు
● ప్రైవేట్ ఉద్యోగులు జంప్
● రెండో రోజూ కొనసాగిన వైనం
నెల్లూరు సిటీ: నగరంలోని స్టోన్‌హౌస్‌పేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండు రోజులుగా జరుగుతున్న ఏసీబీ తనిఖీలతో అక్కడితో పాటు ఇతర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సమీపంలోకి సైతం ప్రైవేట్ ఉద్యోగులు రాలేదు. అధికారులతో పాటు సిబ్బందీ అప్రమత్తమయ్యారు. దీంతో సందడిగా ఉండే ఆఫీసులు బోసిపోయాయి. డాక్యుమెంట్ రైటర్లూ రాకపోవడంతో రిజిస్ట్రేషన్లు తక్కువగా జరిగాయి. కార్యాలయంలోని ఫైళ్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని రికార్డులపై అధికారులు, సిబ్బందిని ప్రశ్నించారు. తనిఖీల సమయంలో కార్యాలయంలో ఉన్న ప్రైవేట్ వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్లనూ విచారించారు.
కలకలం
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు గురువారం కలకలం సృష్టించాయి. నెల్లూరు నుంచి ఇద్దరు అధికారులు చేరుకోగా, వీరి రాకను గమనించిన రైటర్లు, మధ్యవర్తులు జారుకున్నారు. కాగా ఈ విషయమై సబ్ రిజిస్ట్రార్ కోటేశ్వరమ్మను సంప్రదించగా, కొందరు విజిలెన్స్ అధికారులొచ్చి అవసరమైన వ్యక్తిగత సమాచారాన్ని తీసుకెళ్లారనీ, ఏసీబీ దాడులు జరగలేదని బదులిచ్చారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో 21 కంపార్ట్‌మెంట్లు నిండాయి. స్వామివారిని 63,239 మంది బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకోగా.. తలనీలాలను 23,436 మంది సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ. 3.78 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల్లోనే దర్శనమవుతోంది.


