పేదలకు వైద్య విద్యను దూరం కానీయబోం
మనుబోలు: పేదలకు ఉచిత వైద్యం, విద్యను దూరం కానీయబోమని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మండలంలోని కొండూరుసత్రంలో గురువారం నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేద విద్యార్థులకు వైద్య విద్యనందించాలనే ఉన్నతాశయంతో 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని, అయితే ప్రస్తుతం వీటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు యత్నించడం దుర్మార్గమని చెప్పారు. సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే కోటి సంతకాల సేకరణను చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ విధానాలతో విత్తనాలు, యూరియా కోసం రైతులు రోడ్డెక్కే దుస్థితి నెలకొందని చెప్పారు. యూరియా కోసం రేయింబవళ్లూ పడిగాపులు కాస్తున్న ఉదంతాలను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. అన్నదాతలు కోరిన విధంగా కాకుండా ఎకరాకు మూడు బస్తాల యూరియానే ఇస్తామని చెప్పడం అన్యాయమని చెప్పారు. మీ ఇంటి బిడ్డగా ప్రభుత్వంతో పోరాడి సమృద్ధిగా యూరియా అందేలా చూసే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.
అభివృద్ధిని విస్మరించి దోపిడీలు
సర్వేపల్లిలో అభివృద్ధిని విస్మరించి దోపిడీకి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పాల్పడుతున్నారని కాకాణి ధ్వజమెత్తారు. హంతకులు, పామాయిల్ ట్యాంకర్ల దారి దోపిడీ దొంగలు ఆయన వెంట నడుస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దొంగ కేసులు పెట్టించడంలో.. దాడులు చేయించడంలో సోమిరెడ్డి సిద్ధహస్తులని మండిపడ్డారు. తప్పు చేసిన వారిని శిక్షించామే తప్ప.. గిట్టని వారిపై అడ్డగోలుగా కేసులు బనాయించడాన్ని గతంలో తామెన్నడూ చేయలేదని గుర్తుచేశారు. వెంకటాచలం మండలంలో ఎస్టీ నేతపై దాడులు చేయించడం దుర్మర్గపు చర్యగా అభివర్ణించారు. అధికారం ఉందనే ధీమాతో ఎగిరెగిరి పడుతున్న వారి లెక్క రాసిపెట్టుకొని.. తాము కొలువుదీరాక వారి లెక్క సరిచేస్తామని హెచ్చరించారు. పామాయిల్ కంపెనీ ఒక్కో ట్యాంకర్‌కు రూ.20 వేల చొప్పున చెల్లించాలంటూ సోమిరెడ్డి బెదిరిస్తున్న అంశాన్ని వ్యాపారులే స్వయంగా వెల్లడించిన విషయాన్ని గుర్తుచేశారు. గొలగమూడి సంత నిర్వాహకుల నుంచి నెలకు రూ.ఐదు లక్షలను సోమిరెడ్డి కుమారుడు దండుకుంటున్నారని ఆరోపించారు. అనంతరం ప్రజాప్రతినిధులతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున సంతకాలు చేశారు. ఎంపీపీ గుండాల వజ్రమ్మ, ఉప సర్పంచ్ ఆవుల తులసీరామ్, ఎంపీటీసీ సభ్యుడు గుమ్మడి వెంకటసుబ్బయ్య, పార్టీ నేతలు మన్నెమాల సాయిమోహన్‌రెడ్డి, చేడిమాల బుజ్జిరెడ్డి, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, దాసరి భాస్కర్‌గౌడ్, గుంజి రమేష్, జగదీష్, జానకిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులకు యూరియా అందించే బాధ్యత నాది
దాడులకు మూల్యం తప్పదు
కోటి సంతకాల సేకరణలో
మాజీ మంత్రి కాకాణి


