
సమ్మె విరమణ శోచనీయం
● డిమాండ్లు నెరవేర్చేంత వరకు
దశలవారీ పోరాటాలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ప్రధాన డిమాండ్లను నెరవేర్చకుండానే సమ్మెను విరమించడం శోచనీయమని పలువురు పేర్కొన్నారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరులతో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దుగ్గిరాల సూరిబాబు, జిల్లా కార్యదర్శులు హజరత్తయ్య, జాకీర్‌హుస్సేన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూని యన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొజ్జా సుమన్ విలేకరులతో శనివారం మాట్లాడారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికుల క్రమబద్ధీకరణ, గ్రేడ్ – 2 జేఎల్‌ఎంల సమస్యల పరిష్కారం తదితరాలపై సమ్మెకు విద్యుత్ జేఏసీ పిలుపునిచ్చిందని చెప్పారు. ఈ క్రమంలో యాజమాన్యం, ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో డిమాండ్లను నెరవేర్చకుండానే మధ్యలో సమ్మెను విరమించడం శోచనీయమని చెప్పారు. కార్మికుల డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తోందని ఆరోపించారు. దశలవారీ పోరాటాలు, ఆందోళనలు చేసేందుకు విద్యుత్ స్ట్రగుల్ కమిటీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. యూనియన్ ఆఫీస్ బేరర్స్ పెంచలప్రసాద్, జిల్లా నేతలు సురేంద్ర, కొండయ్య, జనార్దన్, దయాకర్, నారాయణ, రామయ్య, మస్తాన్, ప్రసన్నకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.