
బాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వెంకటగిరి(సైదాపురం): సీఎం చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలోని ఎన్‌జేఆర్ భవనంలో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్య, ప్రజలకు వైద్యం అందేలా గత ప్రభుత్వం మెడికల్ కళాశాలను నిర్మించారన్నారు. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ సంస్థలకు అప్పనంగా అప్పగించే కుట్రకు తెరలేపిందని మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబును మించిన వారు దేశంలో ఇంకెవరూ లేరని ఎద్దేవా చేశారు. తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని మరోసారి స్పష్టం చేశారు. రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పార్టీలతో సంబంధం లేకుండా కోటి సంతకాల కార్యక్రమానికి స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావాలన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. దీనికి అధికారులు కూడా సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నట్లు చెప్పారు. జనసేన నేత గూడూరు వెంకటేశ్వర్లు తప్పును ఎత్తిచూపించినందుకు ఆయనపై కూడా కేసు నమోదు చేశారన్నారు. అనంతరం రామ్‌కుమార్‌రెడ్డి మొదటి సంతకం చేసి కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, స్టేట్ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ మెంబర్ బొలిగర్ల మస్తాన్ యాదవ్, పాపకన్ను మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ నక్కా భానుప్రియ, మండల కన్వీనర్లు, రాష్ట్ర విభాగాలకు చెందిన నేతలు పాల్గొన్నారు.