
కాపులంతా కళ్లు తెరవాలి
కందుకూరు: ‘కాపు యువకుడు లక్ష్మీనాయుడు హత్యను పక్కదారి పట్టించేందుకు ఎల్లో మీడియా కట్టు కథలు అల్లుతోంది. కూటమి ప్రభుత్వంలో కాపులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఇప్పటికై నా కళ్లు తెరవాలి’ అని రాధా, రంగా మిత్ర మండలి రాష్ట్రాధ్యక్షుడు వంగవీటి నరేంద్ర అన్నారు. గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామంలో హత్యకు గురైన లక్ష్మీనాయుడి కుటుంబాన్ని ఆదివారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ లక్ష్మీనాయుడు, హంతకుడు కాకర్ల హరిచ్చంద్రప్రసాద్‌లు ప్రాణ స్నేహితులనే విధంగా చిత్రీకరిస్తున్నారన్నారు. ప్రాణ స్నేహితులైతే ప్రాణాలు తీస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీనాయుడి భార్యను లైంగికంగా వేధించి లొంగకపోయే సరికి అతడిని అడ్డు తొలగించేందుకు హత్య చేశారని వివరించారు.
ఎన్నికల్లో వాడుకుని అన్యాయం
కాపు కులాన్ని ఎన్నికల్లో వాడుకుని ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీనాయుడు హత్య కేసులో కేవలం ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేశారన్నారు. మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని, సహకరించిన వారిని కూడా అరెస్ట్ చేయాలన్నారు. ఈ ఘటనలో కులం ప్రస్తావన వచ్చినప్పుడు, ఇప్పుడు తమ కులం గురించి మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. మీరు ఒక్కరే మీ కులం ఓట్లతో గెలిచారా? అని ప్రశ్నించారు. అధికారంలోకి రావడానికి కాపులను వాడుకోలేదా అని నిలదీశారు. హరిచంద్రప్రసాద్ స్వతహాగానే నేర ప్రవృత్తిని కలిగి ఉన్నాడని, తన తల్లి చనిపోకముందే చనిపోయినట్లు బీమా క్లెయిమ్ చేశాడన్నారు. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న మహిళలను కేసులో చేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు. లక్ష్మీనాయుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడ తామన్నారు. వారికి కాపులంతా అండగా ఉంటారన్నారు.
కూటమి ప్రభుత్వంలో న్యాయం జరిగే పరిస్థితి లేదు
లక్ష్మీనాయుడి హత్యను
పక్కదారి పట్టించే కుట్ర
రాధా, రంగా మిత్రమండలి
రాష్ట్రాధ్యక్షుడు వంగవీటి నరేంద్ర