
దీపావళి కాంతులు
● అప్రమత్తతతోనే ఆనందం
● సంబరాల్లో జాగ్రత్తలు తప్పనిసరి
నెల్లూరు(క్రైమ్): దీపావళి.. ఈ పండగంటే ప్రతి ఒక్కరికీ ఆనందం. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా, కులమతాలకు అతీతంగా అందరూ ఆనందోత్సాహాలతో పండగ చేసుకుంటారు. దీపావళి అంటే ముందుగా గుర్తుకొచ్చేది టపాసులే. పల్లె నుంచి పట్నం వరకూ మతాబుల మోతతో దద్దరిల్లాల్సిందే. ఇంటిల్లిపాది మతాబులు కాలుస్తూ సంతోషంగా గడుపుతారు. రంగురంగుల వెలుగుల్లో దీపావళి కాంతుల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉంటే చాలా ప్రమాదమే. వెలుగుల ఆనందం కాస్తా అంధకారంగా మారుతుంది. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే పండగను సంతోషంగా జరుపుకోవచ్చు.
ఇవి పాటించాలి
లైసెన్స్ షాపుల్లోనే బాణసంచా కొనుగోలు చేయాలి. వాటిని వంటగది, పొయ్యి ఉన్న ప్రాంతాల్లో ఉంచరాదు. సురక్షిత ప్రదేశంలో పెట్టాలి. ఇంటి బయట, మైదానాల్లో మాత్రమే కాల్చాలి. ఈ సమయంలో దగ్గరగా నీరు, ఇసుక అందుబాటులో ఉంచుకోవాలి. తల్లిదండ్రుల సమక్షంలోనే పిల్లలు టపాసులు కాల్చాలి. కాటన్ దుస్తులు, పొడుగు చేతుల వస్త్రాలను మాత్రమే ధరించాలి. కాళ్లకు బూట్లు, కళ్లజోడు ధరించడం మంచిది. తారాజువ్వలను బాటిళ్లలో పెట్టి నిటారుగా ఉండేలా సరిచూసుకోవాలి. ఈ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్త వహించినా అవి ఇళ్లలోకి దూసుకుపోయే ప్రమాదముంది. గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు, గడ్డివాములు, పూరిగుడిసెలు ఉండే ప్రదేశాల్లో చిచ్చుబుడ్లు, రాకెట్లు, తారాజువ్వలు వంటివి కాల్చ రాదు. సగం కాలిన వాటిని చేతులతో పట్టుకోవడం తగదు. బాణసంచా పూర్తిగా కాలలేదనుకుంటే పొరపాటే. అకస్మాత్తుగా పేలి గాయాలకు గురయ్యే పరిస్థితి. బాణసంచా కాల్చే సమయంలో వెలువడే వాయువును పీల్చడం హానికరం. గంధం, జింకు, మెగ్నీషియం, నైట్రేట్ వంటి పదార్థాలతో తయారైన టపాకాయలతో వచ్చే వాయువు పీల్చడంతో ఊపిరితిత్తుతులు దెబ్బతినడం, శ్వాసకోశ, ఆస్తమా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు, గర్భిణులు, రెండేళ్లలోపు చిన్నారులకు దూరంగా టపాకాయలను కాల్చడం మంచిది. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో బాణసంచా వల్ల గాయపడితే సొంత వైద్యం కాకుండా వైద్యులను సంప్రదించాలి. అనుకోని ప్రమాదం జరిగినప్పుడు 101కు సమాచారం అందించాలి.

దీపావళి కాంతులు

దీపావళి కాంతులు

దీపావళి కాంతులు

దీపావళి కాంతులు

దీపావళి కాంతులు