
అమరులకు వందనం
● రేపు పోలీసు అమరవీరుల
సంస్మరణ దినం
నెల్లూరు(క్రైమ్): దేశభద్రతకు సరిహద్దుల్లో సైన్యం.. సమాజంలో అంతర్గత భద్రత.. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అనుక్షణం పోరాటం చేస్తున్నారు. వారులేని సమాజాన్ని ఊహించుకోలేం. సంపన్నులు మొదలు సామాన్యుడి వరకు అందరూ సాయం కోసం చూసేది పోలీస్ వైపే. ప్రజల మాన, ప్రాణాలను కాపాడే క్రమంలో చివరకు ప్రాణత్యాగానికి సైతం వెనుకాడరు. విధి నిర్వహణలో అసువులు బాసిన అమరుల త్యాగాలు చిరస్మరణీయం. 1959 అక్టోబర్ 21వ తేదీన దేశభద్రత కోసం భారత్, చైనా సరిహద్దుల్లో ఉన్న లడఖ్ అక్సాయ్ చిన్ వద్ద విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై చైనా సైనికులు భారీ సంఖ్యలో విరుచుకుపడ్డారు. భారత జవాన్లు ఆత్మస్థైర్యంతో విరోచితంగా పోరాడి చొరబాటుదారుల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఈ భీకరపోరులో అసువులు బాసిన అమరుల త్యాగాలకు గుర్తుగా ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా మావోయిస్టులు, ఉగ్రవాదులు, ఇతర అసాంఘిక శక్తులతోపాటు అల్లర్లు, అలజడులను అణిచివేసే క్రమంలో అమరులైన పోలీసు సిబ్బందిని స్మరిస్తూ సోమవారం నెల్లూరులోని పోలీసు కవాతు మైదానంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సమాజంలో పోలీసుల పాత్ర, విధులు, త్యాగాలపై ప్రజలను చైతన్యపరిచేలా వారోత్సవాలు నిర్వహించనున్నారు.
ఈ ఏడాది పదిమంది
ఈ ఏడాది జిల్లాలో అనారోగ్యం, రోడ్డు ప్రమాదం తదితర కారణాలతో పదిమంది మృతిచెందారు. ఏఎస్సై కె.లక్ష్మీనరసయ్య, హెడ్‌కానిస్టేబుల్స్ ఎం.నాగయ్య, ఎం.చలపతిరావు, డి.రాజశేఖర్, ఏఆర్, సివిల్ కానిస్టేబుళ్లు యు.శివకుమార్, ఎస్.నాగరమేష్, ఎస్.అంకయ్య, జి.శివకుమార్, కె.రమేష్‌బాబు, వై.రమేష్‌లు చనిపోయారు.