
శ్లాబ్ కూలి.. కన్నీళ్లు మిగిలి..
● నెల్లూరులో వ్యక్తి దుర్మరణం
నెల్లూరు(క్రైమ్): అతను కుటుంబ సోషణ నిమిత్తం పనికెళ్లేందుకు తెల్లవారుజామునే నిద్ర లేచాడు. సిద్ధమై ఇంటి నుంచి బయటకు రాగా శ్లాబ్ రూపంలో మృత్యువు కబళించింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్లాబ్ కూలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరులోని రంగనాయకులపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సోమిశెట్టి కల్యాణ మండపం సమీపంలో ఎన్.వెంకటేశ్వర్లుకు చెందిన గృహ సముదాయంలో బొమ్మా దయాకర్ (47), లక్ష్మి దంపతులు అద్దెకుంటున్నారు. దయాకర్ స్థానికంగా టీ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోడ్డు మార్జిన్‌లో దుకాణం తొలగించడంతో కొంత కాలంగా తోపుడు బండిపై టీ విక్రయిస్తున్నాడు. రోజూ తెల్లవారుజామునే టీ తయారు చేసుకుని బండిపై పెట్టుకుని అమ్ముకునేవాడు. శుక్రవారం తెల్లవారుజామున సిద్ధమై బయటికొచ్చాడు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రెండో అంతస్తు సైడ్ శ్లాబ్ నానిపోయి ఉండగా అది విరిగి దయాకర్‌పై పడింది. పెద్ద శబ్దం రావడంతో భార్య, పక్క ఇళ్లలో ఉన్నవారు బయటికొచ్చిచూడగా అప్పటికే దయాకర్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. దీంతో వారు 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దయాకర్‌ను పరీక్షించి అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. కాసేటి క్రితం వరకు ఇంట్లో తిరిగిన భర్త విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన లక్ష్మి కన్నీరుమున్నీరుగా రోదించింది. బాధితురాలు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ వైవీ సోమయ్య, ఎస్సై సుల్తాన్‌బాషాలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.

శ్లాబ్ కూలి.. కన్నీళ్లు మిగిలి..