నెల్లూరు(అర్బన్): జిల్లాలో గురువారం భారీ వర్షాలు నమోదయ్యాయి. మర్రిపాడు, ఆత్మకూరు, కలువాయి, పొదలకూరు, కలిగిరి, వింజమూరు, సంగం, బుచ్చి, కోవూరు, విడవలూరు, కొడవలూరు, వెంకటాచలం, మనుబోలు, తోటపల్లిగూడూరు, ఇందుకూరుపేట తదితర మండలాలతోపాటు నెల్లూరులో వానలు కురుస్తున్నాయి. కొన్ని మండలాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు నమోదు కాగా మరికొన్నిచోట్ల తేలికపాటి, మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఆకాశం మేఘావృతమై ముసురు పట్టింది. మరో రెండురోజులుపాటు జిల్లాలో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
నెల్లూరు నగరంలో..
జిల్లా కేంద్రం నెల్లూరు నగరంలో బుధవారం అర్ధరాత్రి నుంచే వానలు మొదలయ్యాయి. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు విడతల వారీగా భారీ వర్షం నమోదైంది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. ఆర్టీసీ కాలనీ, చంద్రబాబునగర్, కొత్తూరు, జనార్దనరెడ్డి నగర్, కల్యాణి నగర్, మనుమసిద్ధి నగర్, శివగిరి కాలనీ, రాజీవ్‌గాంధీ గృహకల్ప తదితర పలు పల్లపు ప్రాంతాల్లో నీరు చేరిపోయింది. ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి, మాగుంట లేఅవుట్ అండర్‌బ్రిడ్జి, విజయమహల్ గేటు బాక్సు టైపు బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో నీరు చేరింది. పొగతోట, ట్రంకురోడ్డు, గాంధీబొమ్మ, ఆచారివీధి తదితర ప్రాంతాల్లో డ్రెయినేజీ కూడిన వర్షపు నీరు పొంగి ప్రవహించింది. దీంతో పాదచారులు, వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. కార్మికులకు పనులు దొరక్క అవస్థలు ఎదుర్కొన్నారు. ఇబ్బంది పడ్డారు.
ఒకటే వాన