
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
● వీరి చలపతితో ములాఖత్
వెంకటాచలం: అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని కూటమి నేతలు గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి హితవు పలికారు. కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసులతో చెముడుగుంట సమీపంలోని జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ వీరి చలపతితో గురువారం ములాఖత్ అయ్యారు. అనంతరం విలేకరులతో కాకాణి మాట్లాడారు. ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకొని అక్రమ కేసులు పెడుతూ జైలుకు పంపడం ఆనవాయితీగా మారిందని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళిత నేతగా వీరి చలపతి ఎదగడాన్ని ఓర్వలేక అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసేతత్వం గల ఆయనపై అన్యాయంగా కేసులు పెట్టడం దారుణమన్నారు. చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్న చలపతి.. జైల్లో ధైర్యంగా ఉన్నారని పేర్కొన్నారు. కోవూరు నియోజకవర్గంలోని ప్రధాన నేతలతోపాటు మాజీ మంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డిని కేసుల్లో ముద్దాయిలుగా చేర్చడం హేయమైన చర్యగా అభివర్ణించారు. తమ పార్టీ నేతలపై కేసులు పెట్టి వేధించడం, సహజ వనరులను దోపిడీ చేయడం మినహా అభివృద్ధి చేస్తున్న దాఖలాల్లేవని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు పోటారాలను ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అక్రమ కేసులు, జైళ్లు తమను ఆపలేవనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. తమ పార్టీ శ్రేణులపై జరిగే అన్యాయాలు, దాడులను నమోదు చేసేందుకు గానూ డిజిటల్ బుక్‌ను మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారని వివరించారు. కూటమి ప్రభుత్వంలో తమ పార్టీకి చెందిన కుటుంబాలను మానసిక వేదనకు గురిచేస్తున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతకు రెండింతలు అనుభవించే పరిస్థితులు ఏర్పడతాయని స్పష్టం చేశారు. వీరి చలపతి కేసులో న్యాయస్థానాన్ని ప్రసన్నకుమార్‌రెడ్డి ఇప్పటికే ఆశ్రయించి, అన్ని సహాయ, సహకారాలను అందిస్తున్నారని చెప్పారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, బచ్చుల సురేష్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.