
రిలీవ్ చేయాలంటూ ధర్నా
నెల్లూరు(టౌన్): ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన బదిలీల్లో పక్క పాఠశాలలకు ట్రాన్స్‌ఫర్ అయినా నేటికీ రిలీవ్ చేయలేదని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డీఈఓ బాలాజీరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిలీవ్ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులు కేటాయిస్తామని, డీఎస్సీ నుంచి వచ్చిన టీచర్లను కేటాయిస్తామని 5 నెలల నుంచి చెబుతూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు భారతి, సుష్మా, బ్యూలా, సుభాషిణి, సుమ, శోభారాణి పాల్గొన్నారు.