
టీచర్లను రిలీవ్ చేయాలని డిమాండ్
నెల్లూరు(టౌన్): ‘ఈ ఏడాది జూన్‌లో బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయని కారణంగా మానసిక వేదనకు గురవుతున్నారు. వారిని వెంటనే రిలీవ్ చేయాలి’ అని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ హజరత్ డిమాండ్ చేశారు. మంగళవారం నెల్లూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీచర్లను రిలీవ్ చేయకుంటే ఈనెల 17న జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట 48 గంటల నిరహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని మండలాల్లో టీచర్లను రిలీవ్ చేయాలని, లేకుంటే జరగబోయే పరిణామాలకు జిల్లా విద్యాశాఖాధికారి పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. అంతర్ జిల్లాల బదిలీల్లో కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చిన జీఓలను బేఖాతరు చేసి కొన్ని ఖాళీలపై వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుని చూపడం జరిగిందన్నారు. డీఎస్సీ 2025 నూతన ఉపాధ్యాయులు ప్రవేశం పొందిన సందర్భంగా వారికి 1ః1 రేషియోలో ఖాళీలను చూపించారన్నారు. నూతన టీచర్లకు ఎస్జీటీ వేకెన్సీల్లో 15 కంటే తక్కువ రోల్ ఉన్న పాఠశాలలను వేకెన్సీలో చూపించారన్నారు. ఉదాహరణకు తడ మండలం ఇరకం ఎంపీపీఎస్‌లో – 4, వాకాడు మండలం మాధవరం ఎంపీపీఎస్‌లో – 5, రెడ్డిపాళెం ఎంపీపీఎస్‌లో – 10, డక్కిలి మండలం పాతనాలపాడు ఎంపీపీఎస్‌లో – నలుగురు ఉన్నారన్నారు. సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దశరథరాములు, నాయకులు పాల్గొన్నారు.