
పాఠాలు చెప్పి ఇంటికెళ్తుండగా..
● రైలు ఢీకొని టీచర్ మృతి
నెల్లూరు(క్రైమ్): ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. బడిలో విద్యార్థులకు పాఠాలు చెప్పి ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతిచెందింది. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా తయారైంది. అతికష్టంపై రైల్వే పోలీసులు మృతురాలు ఎవరనే విషయాన్ని గుర్తించి బాధిత కుటుంబానికి సమాచారం అందించారు. ఈ ఘటన నెల్లూరు వేదాయపాళెం రైల్వేగేటు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. వేదాయపాళెం జనశక్తినగర్‌లో విశ్రాంత బ్యాంక్ మేనేజర్ రామాంజనేయులు, పద్మావతి (50) దంపతులు నివాసముంటున్నారు. ఇద్దరు కుమార్తెలున్నారు. వారికి వివాహమైంది. ఒకరు బెంగళూరులో, మరొకరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. పద్మావతి మనుబోలు మండలం కొలనకుదురు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమె రోజూ ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లి వచ్చేవారు. మంగళవారం కూడా బడిలో విధులు ముగించుకుని వేదాయపాళెంలో దిగి ఇంటికి బయలుదేరారు. రైల్వే గేటు వేసి ఉంది. కొద్దిదూరంలో పట్టాలపై గూడ్సు రైలు ఆగి ఉండటాన్ని చూసింది. పట్టాలు దాటుతుండగా మరోరైలు వేగంగా వచ్చి ఆమెను ఢీకొంది. దీంతో అక్కడికక్కడే చనిపోయింది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై ఎన్.హరిచందన తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి బాధిత కుటుంబానికి సమాచారం అందించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. ఎస్సై హరిచందన కేసు దర్యాప్తు చేస్తున్నారు.