● బహిరంగ మద్య సేవనంపై 52,
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై 17 కేసుల నమోదు
నెల్లూరు(క్రైమ్): ఎస్పీ డాక్టర్ అజిత సోమవారం అర్ధరాత్రి నెల్లూరు నగరంలో పర్యటించారు. నాలుగుకాళ్ల మండపం, ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం, నెల్లూరు బ్యారేజ్, మెడికవర్ వైద్యశాల, బుజబుజనెల్లూరు, అయ్యప్ప గుడి సెంటర్, కరెంటాఫీస్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, వీఆర్సీ తదితర ప్రాంతాల్లో ఎస్పీ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అనంతరం బీట్స్‌ను పరిశీలించి బీట్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నేర నియంత్రణలో భాగంగా రాత్రిపూట వాహనాల తనఖీలు ముమ్మరం చేశామన్నారు. రౌడీయిజం, దౌర్జన్యాలు, దోపిడీ, దొంగతనాల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాల నివారణ, అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకట్ట వేసేందుకు నాకా బందీని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు.
● జిల్లాలో సోమవారం అర్ధరాత్రి 1,580 వాహనాలను తనిఖీ చేశారు. కాగా బహిరంగ మద్య సేవనానికి సంబంధించి 52 కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధించి 17 కేసులు నమోదు చేశారు. 3 వాహనాలు సీజ్ చేశారు. ఎంవీ యాక్ట్ కేసులు 179 నమోదు చేసి రూ.58,795 అపరాధ రుసుము విధించారు.