
బాధిత కుటుంబాలకు నగదు బాండ్ల అందజేత
● ప్రభుత్వం నుంచి ఇంకా అందని పరిహారం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆత్మకూరు నియోజకవర్గం పెరమన గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారును ఇసుక టిప్పర్ ఢీకొట్టిన ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇందుకూరుపేట, నెల్లూరు నగరం గుర్రాలమడుగు సంఘం ప్రాంతానికి చెందిన ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో సీపీఎం నేతలు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చేందుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. కాగా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలకు ఒక్క రూపాయి నష్టపరిహారం అందలేదు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించి ఆర్థిక భరోసా కల్పించాలని నాయకులు టిప్పర్ యజమాని రవీంద్రారెడ్డితో మాట్లాడారు. అతను అంగీకరించి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు సంబంధించి రూ.2,30,000 చొప్పున బాండ్లను అందజేశారు. మంగళవారం రాత్రి గుర్రాలమడుగు సంఘం ప్రాంతంలో నాయకులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నాయకులు కాయం శ్రీనివాసులు, సుధాకర్, బాబు, నారాయణ, సంపూర్ణమ్మ, వెంకటేశ్వర్లు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.