
జాతీయ మానవహక్కుల కమిషన్ విచారణ
బిట్రగుంట: బోగోలు మండలం కడనూతలలో రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల నిర్వహణకు స్థానిక అధికారులు అడ్డంకులు సృష్టిస్తుండడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ అధికారులు మంగళవారం సమగ్ర విచారణ చేపట్టారు. కళాశాల వసతి గృహం నుంచి పంట పొలాల్లోకి వస్తున్న వృథానీరు కారణంగా ఇబ్బందులు పడుతున్నామని స్థానిక టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో పంచాయతీ అధికారులు ప్రాథమిక విచారణ కూడా చేపట్టకుండా, ప్రత్యామ్నాయం చూపించకుండా వృథా నీటిని బయటకు రాకుండా అడ్డుగా గ్రావెల్‌తో కట్టపోయించారు. దీంతో కళాశాలలోని సుమారు 2500 మంది విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిపై కళాశాల అధికారులు, స్థానిక అధికారులతో పాటు జాతీయ మానవహక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో మానవహక్కుల కమిషన్ విచార ణ విభాగానికి చెందిన అధికారులు కుల్బీర్‌సింగ్, యతిప్రకాశ్ శర్మ, సంజయ్‌కుమార్‌తో కూడిన బృందం కళాశాలను సందర్శించి వివరాలు సేకరించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి విచారణ చేపట్టారు. కళాశాల నుంచి వృథా నీరు బయటకు వెళ్లే మార్గాలు, గ్రామస్తుల అభ్యంతరాలపై విచారణ నిర్వహించారు. కళాశాల కరస్పాండెంట్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, అధ్యాపకులు వాస్తవ పరిస్థితిని వివరించారు. స్థానిక టీడీపీ నాయకులు కూడా తమ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో విచారణ కొనసాగిస్తున్నారు.