
శ్రుతిమించుతున్న హిజ్రాల ఆగడాలు
భయాందోళనలో ప్రజలు
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో హిజ్రాల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. రహదారులపై వెళ్లేవారిని అడ్డుకుని నగదు కోసం పీడిస్తున్నారు. దుకాణాల వద్దకు వెళ్లి డబ్బు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వని వారిపై దౌర్జన్యాలు, దాడి చేసి అందిన కాడికి దోచుకెళ్తున్నారు. నడిరోడ్లపై బరితెగిస్తున్నా పోలీసులు కనీస చర్యలు తీసుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారు.
తాజాగా రెండుచోట్ల..
కందుకూరు, నెల్లూరు మినీబైపాస్ రోడ్డులో చోటుచేసుకున్న ఘటనలు హిజ్రాల బరితెగింపు చర్యలకు తార్కాణంగా నిలుస్తున్నాయి. నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్, బోసుబొమ్మ, గాంధీబొమ్మ సెంటర్, విజయమహాల్‌గేటు, ఆర్టీసీ ఇలా ప్రధాన కూడళ్లలో పదుల సంఖ్యలో హిజ్రాలు రోడ్లపైకి వచ్చి అటుగా వెళ్లే వాహనదారులను నగదు కోసం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నగదు ఇవ్వని వారితో అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు నానా దుర్భాషలాడుతున్నారు. పండగల వేళ గుంపులుగా షాపుల వద్దకెళ్లి నగదు డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారస్తులు ఎంతో కొంత ఇస్తే తీసుకోకుండా తాము అడిగినంత ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇవ్వకపోతే దుకాణాల వద్దే బైఠాయించి వ్యాపారాలు జరగకుండా అడ్డుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అక్కడున్న వస్తువులను ధ్వంసం చేస్తున్నారు. వీరిచేష్టలకు బెదిరిపోతున్న కొనుగోలుదారులు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతున్నారు.
తరచూ ఘటనలు
విజయమహాల్ గేటు సమీప రైల్వేట్రాక్ వెంబడి రాత్రివేళల్లో చీకటి కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆ ప్రాంతంలో హాస్పిటళ్లు ఉన్నాయి. రాత్రి వేళల్లో అటుగా వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దసరా పండగ వస్తే మామూళ్ల కోసం వీరు బరితెగిస్తున్నారు. తాజాగా మినీబైపాస్ రోడ్డులోని ఓ ఫ్యామిలీ ధాబాలో మామూళ్ల కోసం 13 మంది వీరంగం చేసిన ఘటనలో నిందితులను బాలాజీ నగర్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు నగరంలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. బెదిరిపోయిన వ్యాపారులు ఫిర్యాదులు చేసేందుకు ముందుకు రావడం లేదు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.