
విషాద ప్రయాణం
● నెత్తురోడుతున్న రహదారులు
● వేగం, రాంగ్‌రూట్, మద్యం మత్తు
తదితరాలే కారణాలు
● బ్లాక్‌స్పాట్లలో కానరాని చర్యలు
● ఈ ఏడాది 390 మంది మృత్యువాత
నెల్లూరు(క్రైమ్): జిల్లాలోని రహదారులు నిత్యం రక్తసిక్తమవుతున్నాయి. రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడం, నిర్లక్ష్యంగా నడిపే వాహనచోదకులు, కనీస విశ్రాంతి ఇవ్వకుండా విధులకు వెళ్లమంటున్న యజమానులు, బ్లాక్‌స్పాట్లలో హెచ్చరిక బోర్డులు లేకపోవడం.. ఇలా కారణాలతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆనందంగా సాగిపోతున్న ప్రయాణాల్లో అంతలోనే అంతులేని విషాదం కమ్మేస్తోంది. కన్నవారిని, కడుపున పుట్టిన వారిని, అయిన వారిని కోల్పోయిన కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతున్నాయి. ప్రమాదాల కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు దృష్టిసారించడం లేదు. ఫలితంగా జిల్లాలో తొమ్మిది నెలల వ్యవధిలో 670 ప్రమాదాలు జరగ్గా 390 మంది మృత్యువాత పడ్డారు. 645 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. ప్రమాదాల తీవ్రత తక్షణం మేల్కోవాల్సిన అవసరాన్ని చాటిచెబుతోంది.
కారణాలెన్నో..
మితిమీరిన వేగం, ఓవర్‌టేక్, అకస్మాత్తుగా వాహనాలు నిలపడం, నిద్ర, మద్యం మత్తులో నడపడం, పరిమితికి మించిన ప్రయాణం, అపసవ్యదిశలో రాకపోకలు సాగించడం, హెల్మెట్, సీట్‌బెల్టులు పెట్టుకోకపోవడం, సకాలంలో గమ్యస్థానాలకు వెళ్లాలన్న తొందరలో వేగంగా నడపడం, రహదారి భద్రత నిబంధనలపై అవగాహన లేమి, వాహనాల సామర్థ్యం సరిగా లేకపోవడం, దెబ్బతిన్న రహదారులు తదితరాలు ప్రమాదాలకు కారణాలుగా ఉన్నాయి.
రెస్ట్ ఏరియాలున్నా..
నెల్లూరు – బద్వేల్ రహదారిలో రెండు, ఏర్పేడు – రాపూరు జాతీయ రహదారిపై రెండు, పోర్టుకు వెళ్లే రహదారిలో ఒకటి, వెంకటాచలం వద్ద, గౌరవరం ప్రాంతాల్లో రెస్ట్ ఏరియాలున్నాయి. అధికశాతం మంది వాటిల్లో కాకుండా రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలిపివేస్తున్నారు. కనీసం అప్రమత్తం చేసేలా ఇండికేటర్లు, స్టిక్కరింగ్‌తో కూడిన ట్రయాంగిల్ గుర్తులూ వాడకపోవవడంతో వెనుక వచ్చేవారికి వాహనాలు కనిపించక వేగంగా ఢీకొడుతున్నారు.
కనీస చర్యలేవి?
మూడు క్యాలెండర్ సంవత్సరాల్లో ముగ్గురు కంటే ఎక్కువగా ఒకే ప్రాంతంలో మరణించి ఉంటే దాన్ని బ్లాక్‌స్పాట్‌గా గుర్తిస్తారు. జిల్లాలో 65 బ్లాక్‌స్పాట్లున్నాయి. అందులో ఎన్‌హెచ్ 16పై 46, ఎన్‌హెచ్ 67పై ఎనిమిది, 565వ జాతీయ రహదారిపై 11 ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని రహదారుల్లోనూ బ్లాక్‌స్పాట్లున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు గానూ ఇసుక డ్రమ్ములు, బారికేడ్లు, ములుపుల వద్ద రేడియం స్టిక్కర్లు, సోలార్ విద్యుద్దీపాలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని రోడ్డు సేఫ్టీ సమావేశాల్లో అధికారులు తీర్మానించారు. అయితే అనేక ప్రాంతాల్లో ఇవి అమలుకు నోచుకోలేదు. బ్లాక్‌స్పాట్‌ల వద్ద నిర్ధిష్ట చర్యలు, కమిటీ నిర్ణయాల అమలుపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి.
గస్తీ ఏది?
జిల్లాలో ఎన్‌హెచ్ 16 జాతీయ రహదారిపై ఆరు హైవే మొబైల్స్, ఎన్‌హెచ్ 67పై రెండు, రాపూరు వైపు ఒక హైవే మొబైల్ ఉంది. అందులో డ్రైవర్‌తో కలిసి ఇద్దరు నుంచి ముగ్గురు సిబ్బంది ఉంటారు. వీరు రోడ్డు ప్రమాదాలు, నేరాలు జరగకుండా గస్తీ నిర్వహించాల్సి ఉంది. ఇంటర్‌సెప్టర్ వాహనంతో నిత్యం వాహన తనిఖీలు చేపట్టాలి. అయితే ఈ వ్యవస్థ మొక్కుబడి చర్యలకే పరిమితమైందనే విమర్శలున్నాయి.
మొక్కుబడిగా..
జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో కొన్ని నిద్రమత్తులోనే జరుగుతున్నాయని గుర్తించిన పోలీస్ అధికారులు డ్రైవర్‌ను మేలుకొలిపేలా స్టాప్ – ఫేస్‌వాష్ పేరిట వినూత్న కార్యక్రమాన్ని రెండేళ్ల క్రితం చేపట్టారు. జాతీయ రహదారులపై అర్ధరాత్రి వేళల్లో పోలీసులు డ్రైవర్లచే ఫేస్‌వాష్ చేయించి వారితో మాటామంతి కలిపి జాగ్రత్తలను వివరించేవారు. దీంతో కొంత మేర ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. కాలక్రమేణా పోలీసు అధికారులకు బందోబస్తులు అధికమవడం, నిత్యం ఏదో ఒక కార్యక్రమం ఉండటంతో ఈ ప్రక్రియ అంతంతమాత్రంగానే సాగుతోంది.
రెండేళ్లలో 840 మంది మృతి
జిల్లాలో రోజురోజుకు రహదారి ప్రమాదాలు పెరుగుతున్నాయి. గడిచిన రెండేళ్లలో 840 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందారు. 1,550 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. 2024లో 828 ప్రమాదాలు జరగ్గా 450 మంది చనిపోయాగా 905 మంది క్షతగాత్రులయ్యారు. ప్రమాదాల కట్టడిలో సంబంధిత అధికారులు విఫమలవుతున్నారనే విమర్శలున్నాయి.
కొన్ని ఘటనలు
ఏప్రిల్ 29వ తేదీన నార్తురాజుపాళెం సమీపంలో జాతీయ హదారిపై ఆగి ఉన్న లారీనీ బైక్ ఢీకొంది. ఈ ఘటనలో బోగోలు పంచాయతీకి చెందిన షేక్ మన్సూర్‌బాషా, విశ్వనాథరావుపేట రామస్వామిపాళేనికి చెందిన ప్రవీణ్‌కుమార్ మృతిచెందారు.
ఏప్రిల్ 30వ తేదిన కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం వద్ద మితిమీరిన వేగంతో కారు ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు.
ఉలవపాడు మండలం చాగల్లు వద్ద గతనెల 8వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేశునిపాడుకు చెందిన ముగ్గురు మృతిచెందారు.
సిద్ధీపురం పంచాయతీ అనసూయనగర్‌కు చెందిన వెంకటశేషయ్య, వెంకటవరలక్ష్మి దంపతులు సొంత ఆటోలో కూరగాయాలు విక్రయించేందుకు వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. వారిద్దరూ దుర్మణం చెందారు.
ఇటీవల సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై రాంగ్‌రూట్‌లో వచ్చిన టిప్పర్ కారును ఢీకొంది. దీంతో కారులోని ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు.