
నకిలీ క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్
● అతని తండ్రిని కూడా...
నెల్లూరు (క్రైమ్): క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ పేరిట అటవీ శాఖలో ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను మోసగించిన నిందితుడితోపాటు అతని తండ్రిని సైతం వేదాయపాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం వేదాయపాళెం పోలీసుస్టేషన్‌లో స్థానిక ఇన్‌స్పెక్టర్ కె. శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. న్యూమిలటరీ కాలనీకి చెందిన వినోద్‌కుమార్ బీటెక్ పూర్తి చేసి తన మామ కేఫ్‌లో పనిచేస్తుండగా, శివాజీనగర్‌లో ఉంటున్న దేవళ్ల సాయికృష్ణ తరచూ కేఫ్‌కు వస్తూ తాను విజయవాడ క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్‌నని పరిచయం చేసుకున్నాడు. అటవీశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని వినోద్‌కుమార్‌ను నమ్మించి రూ.6.51 లక్షల నగదు, ఆరు సవర్ల బంగారు ఆభరణాలు మొత్తంగా రూ.11 లక్షలు తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా ఉద్యోగం ఇప్పించకపోవడం, అడుగుదామని వెళ్లితే సాయికృష్ణ తప్పించుకుని వెళుతుండడంతో మోసపోయానని వినోద్‌కుమార్ గ్రహించాడు. తన మాదిరిగా ఉద్యోగాల పేరిట ఎన్‌సీసీకాలనీకి చెందిన పావని, భారతి, దగర్తికి చెందిన హేమంత్ వద్ద నుంచి రూ.40 లక్షలు తీసుకుని మోసగించినట్లు వినోద్‌కుమార్‌కు తెలిసింది. ఉద్యోగాల పేరిట మోసగించిన సాయికృష్ణపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 24న వేదాయపాళెం పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. స్థానిక ఇన్‌స్పెక్టర్ కె. శ్రీనివాసరావు కేసు నమోదు చేసి గురువారం రాత్రి తెలుగుగంగ కార్యాలయం సమీపంలో సాయికృష్ణను, అతని తండ్రి పోలయ్యను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. విచారణలో నిందితుడికి తండ్రి సహకరించాడని వెల్లడైంది. దీంతో నిందితులిద్దరిని శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి నకిలీ పోలీసు ఐడీ కార్డు, న్యూరో, ఆర్థో, సీనియర్ డాక్టర్ పేర్లతో నకిలీ ఐడీ కార్డులు, రెండు స్కూటీలు, బుల్లెట్, ఒక బైక్, బీఎండబ్ల్యూ కారు తదితరాలను స్వాధీనం చేసుకన్నారు. నిందితుడి వద్ద న్యూరో, ఆర్థో డాక్టర్ పేర్లతో ఉన్న ఐడీ కార్డులు దొరకడంతో వాటిని ఉపయోగించి ఏమైనా నేరాలకు పాల్పడ్డారా? అనే కోణంలో విచారిస్తున్నామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల అభినందించారు. సమావేశంలో ఎస్‌ఐ ఎ. శ్రీనివాసరావు పాల్గొన్నారు.