
బాలకృష్ణ వ్యాఖ్యలు దుర్మార్గం
● వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్
పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి
మార్కాపురం: అసెంబ్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హిందుపూరం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, అత్యంత దుర్మార్గమని ఏపీఐఐసీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ సభలో బాలకృష్ణ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అమర్యాదకరంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు బాలకృష్ణకు లేదన్నారు. చిరంజీవి, చంద్రబాబుతో విభేదాలుంటే వారితోనే తేల్చుకోవాలే తప్ప నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు. అసెంబ్లీలో సభ్యసమాజం తలదించుకునేలా ఆయన మాట్లాడటం తగదన్నారు. సభా మర్యాదలు పాటించకుండా మాట్లాడి ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. సభలో ఎమ్మెల్యే బాలకృష్ణ తీరు చూశాక ఆయనకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేయాలేమో అనిపించేలా ఉందన్నారు. బాలకృష్ణ సొంత ఇంట్లో కాల్పులు జరిపి మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్న సంగతి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసునన్నారు. మాజీ సీఎం జగన్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని జంకె సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.