
ప్రస్తుత ఎమ్మెల్యే పర్యవేక్షణ శూన్యం
ప్రస్తుతం కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆలయ భూముల అన్యాక్రాంతం విషయమై ఎప్పుడూ చర్చించిన సందర్భమే లేదు. అమ్మవారి అపర భక్తురాలిగా ప్రచారం చేసుకునే ప్రశాంతిరెడ్డి ఆలయ భూములకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని భక్తులతోపాటు జొన్నవాడ వాసులు మండిపడుతున్నారు. ఆలయానికి రావడం, దర్శనం చేసుకొని వెళ్లిపోవడం తప్పిస్తే ఆలయానికి సంబంధించిన ఆస్తులు, భూములు ఎక్కెడెక్కడ ఉన్నాయి, వాటి స్థితిగతులేంటనే విషయాలపై పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు విమర్శిస్తున్నారు. టీడీపీ నేతలే కబ్జాలకు పాల్పడుతుండటంతో ఆమెకు తెలిసినా చర్యలు తీసుకోవడం అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. ప్రస్తుతం దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. భక్తులు ప్రతి రోజు వేల సంఖ్యలో అమ్మ వారిని దర్శించుకొని వెళ్తున్నారు. ఇదే సమయంలో ఆలయం ముందు భాగంలో స్థలం ఆక్రమణకు గురైన విషయాన్ని గుర్తించిన పలువురు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టకపోతే భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు.