
వైద్య విద్య ప్రైవేటీకరణ దారుణం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మంజూరైన మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే దిశగా ప్రస్తుత సీఎం చంద్రబాబు అడుగులేయడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గురువారం ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేయించి, 12 పూర్తి చేయగా, మరో ఐదు నిర్మాణం పూర్తయ్యే దశలో తన స్వార్థ ప్రయోజనాల కోసం వీటిని ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఆయన సీఎంగా వ్యవహరించిన సమయంలో రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళాశాలను తీసుకొచ్చిన దాఖలాల్లేవని విమర్శించారు. జగనన్న కృషితో రాష్ట్రంలో 2500 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. పేద విద్యార్థుల కలను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా.. స్థల సేకరణ, అనుమతులతో పాటు 12 మెడికల్ కళాశాలలను పూర్తి స్థాయిలో నిర్మించారని వివరించారు. మిగిలిన మెడికల్ కళాశాలలను పూర్తి చేసేందుకు నిధుల్లేవని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు తెస్తూ.. సంక్షేమ పథకాలను అరకొరగా అమలు చేస్తోందన్నారు. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపైందని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నా, ఆయన మాత్రం పట్టించుకోవడంలేదన్నారు.
చలో మెడికల్ కాలేజీ నేడు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని పార్టీ యువజన, విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టనున్నామని తెలిపారు. మెడికల్ కాలేజీల వద్దకు యువకులు, విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.