
మా ఊరు ఖాళీ చేయబోం
ఉలవపాడు: ప్రభుత్వం భూసేకరణకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా.. తాము మాత్రం మా ఊరు నుంచి ఖాళీ చేసి వెళ్లబోమని కరేడు పంచాయతీ ఉప్పరపాళెం గ్రామస్తులు నిర్ణయం ప్రకటించారు. ఈ మేరకు శనివారం గ్రామ తీర్మానాన్ని బ్యానర్ రూపంలో ప్రకటించి గ్రామ పొలిమేరలో ఫ్లెక్సీగా ఏర్పాటు చేశారు. గ్రామ సభలో చేసిన తీర్మానం ప్రకారం తమ భూములు, ఇళ్లు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇండోసోల్ కంపెనీకి పంటలు పండని బీడు భూములు ఇవ్వాలని, తమ భూములు ఇవ్వబోమని చెప్పారు. తాము ఇక్కడ స్వేచ్ఛగా జీవిస్తున్నామని, తమను తరలించడం అన్యాయమని నినాదాలు చేశారు. తమ భూములను కాపాడాలని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు.