అధికారుల తనిఖీల్లో
వెలుగులోకి..
● దారుణంగా పారిశుధ్యం
● తక్కువ మొత్తంలో చికెన్ తెచ్చిన వైనం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): కూటమి ప్రభుత్వంలో గురుకులాలు అధ్వానంగా తయారయ్యాయి. పేద పిల్లలుండే చోట్ల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సాక్షాత్తు అధికారుల తనిఖీల్లో అనేక విషయాలు వెలుగు చూశాయి. నెల్లూరులోని పొదలకూరు రోడ్డులో ఉన్న గిరిజన బాలుర, బాలికల పాఠశాలలను ఆదివారం జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి బి.శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాటిని నిర్వహిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలుర గురుకులంలో..
ఇక్కడంతా అపరిశుభ్రంగా ఉండటం, ప్రిన్సిపల్ దేవసహాయం ఉదయం 11 గంటలకు సైతం రాలేదు. దీంతో ఆయన్ను పిలిపించారు. ఇంతలో పాఠశాలను సందర్శిస్తే వంట గది ముందు శనివారం నాటి మిగిలిన ఆహార పదార్థాలున్నాయి. మరుగుదొడ్ల వద్ద మురుగునీరు ఉంది. పారిశుధ్యం అధ్వానంగా ఉండటంతో ప్రిన్సిపల్‌ను తీవ్రస్థాయిలో మందలించారు. కాసేపటికి చికెన్‌ను తీసుకొచ్చారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పది కేజీలు అవసరం. అయితే చిన్న కవర్‌లో ఉండటంతో ఇది పది కేజీలా అని అధికారి ప్రశ్నించారు. అందుకు ప్రిన్సిపల్ సంబంధం లేని సమాధానం చెప్పారు. పారిశుధ్యంపై తగిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసులు ఆదేశించారు. డ్యూటీ టీచర్ రాకపోవడంతో పిల్లలు ఇష్టమొచ్చినట్లు ఆడుకోవడం కూడా సరికాదని తీవ్ర స్థాయిలో హెచ్చరించి పలు సూచనలు చేశారు.
బాలికల గురుకులంలో..
గిరిజన బాలికల గురుకులంలో కూడా పరిస్థితి అధ్వానంగా ఉంది. అపరిశుభ్రంగా ఉండటం, వంట గదిలో వృద్ధురాలు కూరగాయలు కోయడాన్ని అధికారి చూసి డ్యూటీ టీచర్‌ను ప్రశ్నించారు. అయితే ఆ టీచర్‌కు అధికారి తెలియకపోవడంతో ఏదో సమాధానాలు చెప్పింది. అనంతరం ఆయన సంక్షేమ శాఖాధికారి అని తెలుసుకుంది. వంట చేసే ఆమె రాకుండా అమ్మను పంపించిందని జవాబిచ్చింది. ఈలోపు అక్కడున్న విద్యార్థినులతో సంక్షేమాధికారి మాట్లాడారు. వారికి ప్రాథమిక అంశాలు కూడా తెలియదని గుర్తించారు. ఐటీడీఏ అంటే ఏమిటి?, అది ఎలా పనిచేస్తుంది?, ఎలా చదువుకోవాలనే అంశాలపై శ్రీనివాసులు అవగాహన కల్పించారు. రెండు గురుకులాల నిర్వాహణపై పలు సూచనలు ఇచ్చారు. సంబంధిత సిబ్బందికి మెమోలు జారీ చేస్తామన్నారు.
అధ్వానంగా గురుకులాలు