
చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతుకు కష్టాలే
● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
● 9న ‘అన్నదాత పోరు’ పోస్టర్ ఆవిష్కరణ
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు కష్టాలు తప్పడం లేదన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అతివృష్టి, అనావృష్టితో రైతులు తీవ్రంగా నష్టపోయారని, గిట్టుబాటు ధరల్లేక అప్పుల ఊబిలో కూరుకుపోయా రన్నారు. ఇప్పుడు అధికారంలో వచ్చినా రైతులకు యూరియా అందించకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విత్తనాలు దొరక్క, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పంటలు ఎగుమతి లేకపోవడంతో రైతులు నిరాశ నిస్పృహలతో ఉన్నారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రైతున్నలకు బాసటగా ఈ నెల 9వ తేదీ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ‘అన్నదాత పోరు’ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆదివారం నెల్లూరు రాంజీనగర్ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాలు రైతులకు వెన్నుదన్నుగా ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చిన ఘనత వారికి దక్కుతుందన్నారు. రాజశేఖరరెడ్డి చేపట్టి జలయజ్ఞం, ఉచిత విద్యుత్ అమలు, జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన రైతుభరోసా కేంద్రాలతో రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా నిర్వహించుకున్నారని తెలిపారు. రైతు భరోసాగా ఏడాది రైతులకు రూ.13,500, సీజన్‌కు ముందే ఎరువులు, విత్తనాలు సమృద్ధిగా అందించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో రైతులు జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయన్నారు. వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రైతు సంతోషంగా ఉంటూ అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి తొలి ఏడాది నుంచి ప్రతి రైతు ఎకరాకు రూ.20 వేల నష్టపోతున్నారన్నారు. కూటమి విధానాల మూలంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటూ వ్యవసాయ రంగంలో నష్టాలు చవిచూడాల్సి వస్తుందన్నారు. వైఎస్సార్‌సీపీ నేత లు, కార్యకర్తలు, అన్నదాతలు జయప్రదం చేయాలని కోరారు.