
సత్వర పరిష్కారం చూపాలంటూ..
● కలెక్టరేట్‌లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● ప్రజల నుంచి 515 అర్జీలు
● టీడీపీ వారు పింఛన్ తీసేయించారని
వృద్ధుడి ఆవేదన
నెల్లూరు రూరల్: నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజలు పోటెత్తారు. కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ తదితరులు వినతులు స్వీకరించారు. మొత్తం 515 అర్జీలుందాయి. అధికంగా రెవెన్యూ శాఖవి 221, పోలీస్ శాఖవి 71, మున్సిపల్ శాఖవి 46, సర్వేవి 31, పంచాయతీరాజ్ శాఖవి 41 తదితర శాఖలవి ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో విజయ్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, డ్వామా పీడీ గంగాభవాని, హార్టికల్చర్ ఏడీ సుబ్బారెడ్డి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ విజయన్ తదితరులు పాల్గొన్నారు.
● కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అన్యాయం చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఆవుల నాగేంద్ర, సుభాన్‌బాషా తెలిపారు. వినతిపత్రమిచ్చిన అనంతరం మాట్లాడుతూ వైకల్య శాతాన్ని తగ్గించడంతో దివ్యాంగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకు అర్హత కోల్పోతున్నారన్నారు.
● ప్రభుత్వం ద్వారా వచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిహారం నగదును కల్లూరు చిన పెంచలయ్య, ఉషా అనే వారు కాజేశారని సజ్జాపురం ప్రాంతానికి చెందిన గురునాథం చందులు వినతిపత్రం సమర్పి ంచారు. పోలీసులు స్టేషన్ చుట్టూ తిప్పుకొంటున్నారని చెప్పారు. వారికి ఫిర్యాదు చేసినందుకు చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు.
● అదనపుకట్నం కోసం భర్త షాహుల్ వేధిస్తున్నాడని కావలికి చెందిన షేక్ రేష్మా వినతిపత్రమిచ్చారు. కలిగిరిలో ఉండే నా అత్తమామలు పట్టించుకోవడం లేదని వాపోయారు. భర్త మద్యం తాగొచ్చి చిత్రహింసలు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కావలి రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం తన తల్లి ఇంట్లో మూడేళ్ల వయసున్న బిడ్డతో ఉంటున్నట్లు చెప్పారు. న్యాయం చేయాలని కోరారు.
ప్రభుత్వ స్థలం ఆక్రమించారు
కలువాయి మండలం దాచూరు గ్రామ పంచాయతీలోని ముక్కుతిప్ప గ్రామంలో సర్వే నంబర్ 989, 956లో 56 ఎకరాల మేత పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి నిమ్మచెట్లు నాటారని పలువురు వినతిపత్రమిచ్చారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్యంలో ఈ పొలాన్ని పేదలకు పంచాలని చూడగా ముక్కుతిప్ప గ్రామానికి చెందిన కొప్పాల నారయ్య, సుబ్బయ్య, బోరెడ్డి చినపెంచలస్వామి, లక్కాకుల శారదమ్మ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చారన్నారు. ప్రభుత్వం మారగానే ఆక్రమించుకుని నిమ్మ చెట్లు నాటారన్నారు. వీఆర్వో, ఆర్‌ఐ, తహసీల్దార్లతో కుమ్ముక్కై దొంగ పట్టాలు సృష్టించి, విద్యుత్ సరఫరా, బోర్లు వేసుకున్నారన్నారు. కోర్టు పరిధిలో ఉన్న భూములకు పట్టాలెలా ఇస్తారని ప్రశ్నించారు. పక్కనే ఉన్న 200 ఎకరాలు ఆక్రమించేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు.
హద్దులు చూపాలని వినతి
కలువాయి మండలం గోపారం సచివాలయ పరిధిలోని చింతలాత్మకూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 32 సీ1లో ఉన్న 4.6 ఎకరాల్లో తమకు సంక్రమించిన భూమికి హద్దులు చూపించాలని ఎస్.నిరంజన్, రాధాకృష్ణ కోరారు. వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన పి.శివశంకర్ భార్య వైదేహి ఈ భూమిని ఆక్రమించుకుని దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. సాగు చేసుకునేందుకు వెళ్తే అడ్డుకుంటున్నారని చెప్పారు. తహసీల్దార్ హద్దు రాళ్లు వేయించారన్నారు. వాటిని తొలగించినట్లు చెప్పారు. ఎస్సైకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. సర్వే చేయించాలని కోరారు.
కొండయ్య
పింఛన్ రాకుండా అడ్డుకుంటున్నారు
సంవత్సరం నుంచి పింఛన్ రాకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని జలదంకి మండలం కోదండరామాపురానికి చెందిన గోవింద కొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నేతలు వేరే వాళ్ల భూమిని తన పేరుపై ఎక్కించి పెన్షన్ తీయించేశారని వాపోయారు. నడవలేకపోతున్నాని, పెన్షన్ ఇప్పించాలని కోరారు.

సత్వర పరిష్కారం చూపాలంటూ..

సత్వర పరిష్కారం చూపాలంటూ..

సత్వర పరిష్కారం చూపాలంటూ..