వెంకటగిరి రూరల్: ప్రసిద్ధి చెందిన పోలేరమ్మ తల్లి జాతర బుధవారం కోలాహలంగా ప్రారంభం కానుంది. ఉదయం నుంచే ప్రతి వీధిలో పోలేరమ్మకు మడి భిక్షం పెట్టండి.. పోతురాజుకు టెంకాయ కొట్టండి.. అంటూ భక్తుల నినాదాలతో పట్టణం హోరెత్తనుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వేపాకు తోరణాలతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఇంట్లో పసుపు ప్రతిమను తయారు చేసి పూజలు చేస్తారు. అంబలిని నైవేద్యంగా సమర్పించి భక్తిని చాటుకుంటారు. పోలేరమ్మ తల్లి దర్శనార్థం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఉచితంతోపాటు రూ.100, రూ.300 టికెట్ల క్యూలైన్లు పెట్టారు. వెంకటగిరి జన జాతరకు బుధ, గురువారాల్లో లక్షలాది మంది తరలిరానున్నారు. దీంతో పట్టణంలో ఏ ఇంట్లో చూసినా సందడి వాతావరణం కనిపిస్తోంది.