
ప్రశ్నిస్తే గొంతునొక్కుతున్న ప్రభుత్వం
నెల్లూరు(అర్బన్): రైతులు పంటలు పండించుకునేందుకు ఒక్క బస్తా యూరియా దొరకడంలేదు. బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేవు. పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదంటూ కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాకాణి మాట్లాడుతూ ఽప్రజాస్వామ్యబద్ధంగా రైతు సమస్యలపై ధర్నా చేసేందుకు ఎస్పీ, డీఎస్పీలకు దరఖాస్తు చేసుకుంటే అర్ధరాత్రి రెండు గంటలకు వాట్సాప్ ద్వారా అనుమతిస్తున్నట్లు మెసేజ్ పెట్టడం దారుణమన్నారు. అది కూడా 15 మందికే అనుమతి అని పేర్కొనడం బాధాకరమన్నారు. పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నా, ఎన్ని ఆంక్షలు పెట్టినా రైతులు వేలాది మంది తరలి రావడం, కార్యక్రమా న్ని సూపర్ సక్సెస్ చేయడం చూస్తే కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అర్థమవుతుందన్నారు. ప్రశ్నిస్తే గొంతునొక్కడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.
రూ.270లకు అందాల్సిన యూరియా బస్తా బహిరంగ మార్కెట్‌లో రూ.600లకు అమ్ముతున్నారని కాకాణి ఆరోపించారు. 50 శాతం ఎరువులు మాత్రమే డీలర్లకు ఇవ్వాలన్నారు. మిగతా 50 శాతం సొసైటీల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించాలనేది నిబంధన ఉందన్నారు. లక్షల టన్నుల యూరియా తీసుకువచ్చామని చెబుతున్న ప్రభుత్వం అదంతా ఎక్కడికి పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 50 శాతంకి మించి డీలర్లకు ఎరువులు ఇవ్వడం వెనుక రూ. 200 కోట్ల కమీషన్లు చేతులు మారాయన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వ్యవసాయం పండగ చేసిన విధంగా తమ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారన్నారు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా ఎరువులు అందించారన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు అధికారంలోకి రాగానే ధరల స్థిరీకరణ నిధిని ఎత్తేశాడన్నారు. తమ ప్రభుత్వంలో పుట్టి ధాన్యానికి మద్దతు ధర 19,700 ఉంటే బహిరంగ మార్కెట్‌లో రైతులు రూ.24 వేలకు అమ్ముకున్నారన్నారు. చంద్రబాబు పాలనలో రూ.15 వేలకే పుట్టి ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. తమ కాలంలో రైతులు ఏనాడు రోడ్డెక్కలేదన్నారు.
ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు దివంగత సీఎం వైఎస్సార్, ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యత నిచ్చారన్నారు. అయితే అందుకు విరుద్ధంగా చంద్రబాబు పాలనలో రైతు కంట కన్నీరు కారుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సెక్షన్ 30 పేరు చెప్పి నోటీసులు ఇవ్వడం, హౌస్ అరెస్టులు చేయడం, రైతులను ధర్నాలకు రానీయకుండా పోలీసులు దిగ్భందించడం చూస్తే చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ ఉద్యమం అంటే వణుకు పుడుతుందన్నారు. వైఎస్సార్ జలయజ్ఞం, జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులను ఆదుకుంటే చంద్రబాబు రైతు కష్టాలను గాలికొదిలేశాడని విమర్శించారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ అందరి ఆకలి తీర్చేందుకు కష్టపడే రైతన్నలు ఒక్క కట్ట యూరియా కోసం రాత్రి, పగలు క్యూలో నిలబడాల్సిన దుస్థితి ఏంటని నిలదీశారు. రైతులకు ఎరువులు ఇవ్వకుండా వ్యాపారుల గుప్పెట్లో పెట్టడం సిగ్గు చేటన్నారు. వరి కోతలు ప్రారంభమై 10 రోజులు అయిందని మరో 15 రోజుల్లో వరికోతలు పూర్తవుతున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు.
వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు శివుని నారసింహారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల కాలంలో పత్తి, పసుపు, మినుము, వరి, ఉల్లి ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. అధికారంలోకి వస్తే సంవత్సరానికి రూ.20 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తానన్న చంద్రబాబు తొలి సంవత్సరం ఎగనామం పెట్టాడన్నారు. రెండో సంవత్సరం కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. ఈ రెండేళ్లకు చంద్రబాబు రైతులకు రూ.35 వేలు బాకీ ఉన్నాడన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు, రైతులు బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, కోవూరు యువజన విభాగం అధ్యక్షుడు నల్లపరెడ్డి రజిత్‌రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి, మొయిళ్ల గౌరి, లక్ష్మీసునంద, మల్లి నిర్మల, పేర్నాటి కోటేశ్వరరెడ్డి, ఊటుకూరు నాగార్జున, ఆశ్రిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు: యూరియా సరఫరా కాక రైతులు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం వచ్చే సీజన్‌కు కూడా యూరియా అందుబాటులో ఉందంటూ పచ్చి అబద్ధాలు చెబున్నారని మాజీ ఎమ్మెల్యే కందుకూరు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ దుయ్యబట్టారు. ఇండోసోల్ కంపెనీ కోసం బలవంతంగా భూములు తీసుకోవడంతో నష్టపోతున్న రైతులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు పాల్పడితే కోర్టుకు వెళ్లి అయినా అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారన్నారు. అవినీతి పనులు చేస్తే తగిన గుణపాఠం చెప్తారనే విషయాన్ని ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.
చంద్రబాబు పాలనలో రైతన్నల రోదనలు
యూరియా దొరకదు.. పంటలకు
గిట్టుబాటు లభించదు
రైతు సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తాం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
కాకాణి గోవర్ధన్‌రెడ్డి
అన్నం పెట్టే రైతు రోడ్డెక్కాల్సిన దుస్థితి
యూరియాపై సీఎం చెప్పేవన్నీ అబద్ధాలే..
వైఎస్సార్‌సీపీ ఉద్యమం అంటే
చంద్రబాబుకు వణుకు
రూ.3 వేల కోట్లతో
మా ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధి
ఏ పంటకు గిట్టుబాటు ధరల్లేవు
చేతులు మారిన రూ.200 కోట్ల కమీషన్లు

ప్రశ్నిస్తే గొంతునొక్కుతున్న ప్రభుత్వం

ప్రశ్నిస్తే గొంతునొక్కుతున్న ప్రభుత్వం

ప్రశ్నిస్తే గొంతునొక్కుతున్న ప్రభుత్వం

ప్రశ్నిస్తే గొంతునొక్కుతున్న ప్రభుత్వం