
ముందు మాకు.. తర్వాతే మీకు..
● కూటమి సభకు ఆర్టీసీ బస్సులు
● ఇక్కట్లు పడిన ప్రయాణికులు
● ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్న వైనం
నెల్లూరు సిటీ: ఊరికెళ్లేందుకు బిడ్డలతో వచ్చిన తల్లులు.. వేరే నగరంలో చదువుకునే విద్యార్థులు.. ఉద్యోగంలో భాగంగా మరో ప్రాంతానికి చేరాల్సిన వ్యక్తులు.. ఆస్పత్రులకు వెళ్లాల్సిన వృద్ధులు.. ఎందరో ఆర్టీసీ బస్టాండ్లకు వచ్చి బస్సుల కోసం ఎదురు చూశారు. కానీ కూటమి పెద్దలు బస్సుల్ని తమ సభకు తరలించి వారందరినీ కష్టపెట్టారు.
అనంతపురంలో బుధవారం కూటమి పార్టీలు సూపర్ సిక్స్.. సూపర్ హిట్ బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి. దీని కోసం జిల్లా నుంచి 260 బస్సులను ఆర్టీసీ అధికారులు కేటాయించారు. నెల్లూరు డిపో–1 నుంచి 40, డిపో–2 నుంచి 60, ఆత్మకూరు నుంచి 31, కావలి నుంచి 40, ఉదయగిరి నుంచి 29, కందుకూరు నుంచి 35, రాపూరు నుంచి 25 బస్సులను పంపారు. మంగళవారమే వాహనాలను తరలించారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయంగా బస్సులను ఏర్పాటు చేయలేక అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది మే 30వ తేదీన మహానాడు కార్యక్రమానికి 259 బస్సులు కేటాయించారు. ఇలా కూటమి పెద్దలు ఇబ్బంది పెడుతుండటంతో ప్రయాణికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
ఎదురుచూపులు
నగరంలోని డిపో 1, 2లో బస్సుల కోసం ప్రయాణికులు మంగళవారం గంటల తరబడి ఎదురుచూశారు. ఉద్యోగస్తులు, విద్యార్థులు మండలాల నుంచి నగరానికి వచ్చేందుకు అష్టకష్టాలు పడ్డారు. నెల్లూరు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకున్న వారు వచ్చిన ఒకటి, రెండు బస్సుల్ని ఎక్కేందుకు పడిన పాట్లు వర్ణనాతీతం. గంటలు తరబడి వేచిచూసినా బస్సులు రాకపోవడంతో కొందరు తిరిగి వెళ్లిపోయారు. మరికొందరు ఇతర వాహనాలను ఆశ్రయించారు.
అస్సలు బస్సులేవీ?
అసలే ఉచిత బస్సుకు ఆంక్షలున్న నేపథ్యంలో మహిళలు అసహనంగా ఉన్నారు. బుధవారం జరిగే సభకు బస్సుల్ని పంపారు. ఊర్లకు వెళ్లేందుకు వచ్చిన మహిళలు బస్టాండ్లలోని పరిస్థితుల్ని చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ తీరు బాగోలేదని బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

ముందు మాకు.. తర్వాతే మీకు..

ముందు మాకు.. తర్వాతే మీకు..