
మిగులు పొగాకు కొనుగోలుకు అనుమతులు
మర్రిపాడు: రైతులు అధికంగా, అనధికారికంగా పండించిన పొగాకు అమ్మకానికి భారత వాణిజ్య, పరిశ్రమలశాఖ అనుమతిచ్చిందని డీసీపల్లి వేలం కేంద్రం నిర్వహణాధికారి జి.రాజశేఖర్ సోమవారం తెలిపారు. పొగాకు బోర్డు అనుమతించిన పరిమితిలో 10 శాతం అధిక ఉత్పత్తి వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా సాధారణ సర్వీస్ చార్జీతో, 11 నుంచి 20 శాతం అధిక ఉత్పత్తి వరకు సాధారణ సర్వీస్ చార్జీ (1శాతం)తోపాటు అదనపు సర్వీస్ చార్జ్ 2 శాతం, కిలోకు రూ.1 చొప్పున, 20 శాతం పైన అధిక ఉత్పత్తి అమ్మకానికి సాధారణ సర్వీస్ చార్జీ (1శాతం)తోపాటు అదనపు సర్వీస్ చార్జ్ 3శాతం, కిలోకి రూ 1 అపరాధ రుసుం ఉంటుందని తెలియజేశారు. రైతులు పొగాకు బోర్డును సంప్రదించి ఎంత సరుకు ఉందో తెలియజేస్తూ దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. వాణిజ్య సరళిలో పెంచే నారుమడికి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లేని పక్షంలో పొగాకు బోర్డు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
జిల్లా సైన్స్
అధికారిగా శివారెడ్డి
నెల్లూరు (టౌన్): జిల్లా సైన్స్ అధికారిగా శివారెడ్డిని నియమించిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. గతంలో జిల్లా సైన్స్ అధికారిగా పనిచేస్తున్న కరుణాకర్‌రెడ్డికి హెడ్‌మాస్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ తిరుపతి జిల్లా కోట జెడ్పీ హైస్కూల్‌లో పోస్టింగ్ కల్పించారు. దీంతో జిల్లా సైన్స్ అధికారి నియామకానికి తొలుత జిల్లా విద్యాశాఖాధికారులు ప్రకటన ఇచ్చారు. ఈ పోస్టింగ్‌కు ఫిజిక్స్, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్లు పలువురు పోటీ పడ్డారు. వీరందరిని రిజెక్ట్ చేశారు. రెండో సారి నోటిఫికేషన్ తర్వాత విడవలూరు మండలం రామతీర్థం జెడ్పీ హైస్కూల్‌లో బయాలజికల్ టీచర్ శివారెడ్డిని నియమిస్తూ గత నెల 14న ఉత్తర్వులు వెలువరించారు. శివారెడ్డి నియామకంలో స్థానిక ఎమ్మెల్యే చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. పోస్టింగ్ ఇచ్చిన రోజే హడావుడిగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోనే బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ విషయం నేటి వరకు మీడియాకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచడం గమనార్హం. జిల్లా విద్యాశాఖాఽధికారులు ఆయన పోస్టింగ్‌పై సమాచారం ఇవ్వకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 18 కంపార్ట్‌మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 27,410 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 9,656 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.39 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లోనే దర్శనమవుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళితే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది.
అరుణ, అనుచరులపై
న్యాయవాది ఫిర్యాదు
నెల్లూరు (వీఆర్సీసెంటర్): తన కార్యాలయాన్ని పెట్రోలు పోసి తగుల పెడుతానని నిడిగుంట అరుణ బెదిరించిందని కోవూరుకు చెందిన హైకోర్టు న్యాయవాది రాజారామ్ సోమవారం పోలీస్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నిడిగుంట అరుణ ఎస్సీ అని చెప్పుకుంటూ అనేక మందిని బెదిరించి వారి వద్ద డబ్బులు వసూలు చేసేదన్నారు. తాను కోవూరులో నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని ఓ ప్లాట్‌లో అరుణ ఉంటూ అనేక అసాంఘిక కార్యక్రపాలకు పాల్పడేదన్నారు. గన్ కల్చల్‌తో అందరినీ బెదిరిస్తోందని, స్థానికులు కూడా ఆరోపిస్తున్నారన్నారు. రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్‌పై వచ్చిన సమయంలో కోవూరులోని అరుణ ప్లాట్‌లోనే ఉండేవాడని, దీంతో అపార్ట్‌మెంట్ వాసులు భయాందోళనలకు గురయ్యారని, ఇందుకు సంబంధించి అన్నీ ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. తన కార్యాలయాన్ని పెట్రోలు పోసి తగుల పెడుతానని అరుణ బెదించిందని, ఈ విషయమై రెండు నెలల క్రితం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేస్తే తన ఫిర్యాదు కోవూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిందని, అయినప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదని వాపోయారు. న్యాయవాది అయిన తనకే న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగుతుందన్నారు. ఎస్పీ కృష్ణకాంత్ న్యాయం చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు.