అన్నదాతల ఆక్రందనలు.. | - | Sakshi
Sakshi News home page

అన్నదాతల ఆక్రందనలు..

Sep 9 2025 1:10 PM | Updated on Sep 9 2025 1:40 PM

జిల్ల

అన్నదాతల ఆక్రందనలు..

లేట్‌ ఖరీఫ్‌ వరి, ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు యూరియాకు అవస్థలు

బస్తా రూ.600 కావాలంటే పురుగు మందు కొనాలని కండీషన్‌

వినియోగం లేదని చేతులెత్తేసిన అధికారులు

ధాన్యం నిల్వలకు అందుబాటులో లేని గోడౌన్లు

గత ప్రభుత్వం నిర్మించిన గోడౌన్లనూ గాలికొదిలేసిన పాలకులు

ధాన్యం ఆరబోతకు ప్లాట్‌ఫారాలు లేని దుస్థితి

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు నేడు

వ్యవసాయం అనేది ఓ యజ్ఞం. ఆ యజ్ఞకర్త రైతు నేడు అవస్థలతో రోడ్డెక్కాల్సిన పరిస్థితిని కల్పించింది. ఒక వైపు విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేక రైతులు ఆందోళన చెందుతుంటే, మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక నష్టాల బారిన పడుతున్నారు. వరితోపాటు కూరగాయలు, పూలు, ఉద్యాన పంటలకు యూరియా అత్యవసరం. అయితే యూరియా కావాలంటే అదీ బ్లాక్‌ ధరలకు.. కచ్చితంగా పురుగు మందు కొనాలని కండీషన్‌ పెడుతున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. రైతు భరోసాగా ఆర్థిక సాయం ఇచ్చారు. 

గ్రామాల్లోనే ఆర్బీకేలు ఏర్పాటు చేసి అక్కడే విత్తనాలు, ఎరువులు అందించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించారు. ఆ ప్రభుత్వంలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం, గిట్టుబాటు ధరల కోసం రోడ్డెక్కిన చరిత్ర లేదు. కూటమి అధికారంలోకి వచ్చాక అంతకంటే ఎక్కువగా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని చెప్పినా మొదటి సంవత్సరం ఎగ్గొట్టింది. రెండో సంవత్సంలో గత ప్రభుత్వంలోని లబ్ధిదారులను తగ్గించి హామీ ఇచ్చిన మేరకు కాకుండా తక్కువ ఇచ్చింది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా అన్నదాతల ఆక్రందనలు.. చంద్రబాబు పాలనలో అరణ్య రోదనగా మారింది. విత్తనాలు, ఎరువుల ఇక్కట్లు మొదలు.. పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మొన్నటి వరకు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక రోడ్డెక్కితే కేసులు పెట్టిన కూటమి ప్రభుత్వం కాదు కాఠిన్య ప్రభుత్వం.. తాజాగా యూరియా కావాలని అడుగుతుంటే రైతులను, ప్రతిపక్షాలను పశువులతో పోల్చిన చరిత్ర చంద్రబాబుకే దక్కుతోంది. ఎరువులు కావాలని రైతులు రోడ్డెక్కకూడదంటూ అధికార దురంహకారాన్ని ప్రదర్శిస్తున్నారు.

విత్తనాలతో రైతుల పోరాటం

వ్యవసాయం ప్రారంభించాలంటే విత్తనాలతోనే రైతుల పోరాటం ప్రారంభమవుతోంది. జిల్లాలో రబీ సీజన్‌లో 9 లక్షల ఎకరాల్లో, ఖరీఫ్‌ 5 లక్షల ఎకరాల్లో అంటే రెండు సీజన్లకు కలిపి సుమారు 14 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. ఎకరాకు 25 కేజీల విత్తనాలు అవసరం ఉంది. ఈ ప్రకారం రబీ సీజన్‌లో 9.5 లక్షల ఎకరాలకు సుమారు 22,500 మెట్రిక్‌ టన్నుల విత్తనాలు అవసరం ఉండగా, ఈ ఏడాది కూటమి ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా కేవలం 1000 టన్నులకు మించకుండా సరఫరా చేసినట్లు ఆ శాఖ గణాంకాలే చెబుతున్నా యి. ఈ విత్తనాల కోసం మండల వ్యవసాయశాఖ కార్యాలయాల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితిని రైతులు ఎదుర్కొన్నారు. మిగతా 21,500 మెట్రిక్‌ టన్నుల విత్తనాల కోసం రైతులు ప్రైవేట్‌ విత్తన వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఖరీఫ్‌కు సంబంధించి 12,500 మెట్రిక్‌ టన్నుల విత్తనాలు అవసరమైతే కేవలం వెయ్యి క్వింటాళ్ల లోపే సరఫరా చేసి చేతులు దులుపుకుంది.

ధాన్యానికి గిట్టుబాటు ధరలేక నష్టాల్లో..

జిల్లాలో ప్రధానంగా అత్యధిక విస్తీర్ణంలో వరి సాగు జరుగుతోంది. సాధారణంగా రబీ సీజన్‌లో 9 లక్షలు, ఖరీఫ్‌ సీజన్‌లో 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. రబీలో సగటున ఎకరాకు 4 పుట్ల ధాన్యం లెక్కన 30.42 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుంది. ఖరీఫ్‌లో సగటున 3.5 పుట్ల ధాన్యం దిగుబడి వస్తే.. ఈ లెక్కన 14.79 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహన్‌రెడ్డి రైతు భరోసా కేంద్రాల ద్వారానే విక్రయించాలని, అందుకు ఈ–క్రాప్‌ తప్పని సరి చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 2019 నాటికి (రబీ సీజన్‌లో) క్వింటా ధాన్యం ఏగ్రేడ్‌ ధర రూ.1,835 ఉంటే.. పుట్టి ధాన్యం ధర రూ.15,505 ఉంది. 2023–24 నాటికి క్వింటా ధరను రూ.2,320 పెంచారు. అంటే పుట్టి రూ.19,604 పలికింది. అయితే అప్పటి ముఖ్యమంత్రి తీసుకున్న చొరవతో పుట్టి ధాన్యం అన్నదాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మించి రూ.24 వేల విక్రయించుకున్నారు.

కూటమి వచ్చాక ధరలు పతనం

కూటమి అధికారంలోకి వచ్చాక ధరల పతనంతో రైతులు ఎకరాకు సగటున రూ.26 వేల నుంచి రూ.32 వేల వరకు నష్టపోయారు. ఈ ప్రభుత్వం ధాన్యానికి ఏ మాత్రం మద్దతు ధరను పెంచలేదు. గత ప్రభుత్వంలో ఉన్న ధరలను కొనసాగించింది. ప్రభుత్వ మద్దత ధర ప్రకారం అయితే పుట్టి రూ.19,604 ఉంటే.. దళారులు, మిల్లర్లు కలిసి రూ.16 వేల నుంచి 17,500 లోపలే కొనుగోలు చేశారు. సంవత్సరం.. సంవత్సరానికి ధరలు పెరగాల్సి ఉండగా ప్రభుత్వ పెద్దల నుంచి అధికారులు వరకు మిల్లర్లతో మిలాఖత్‌ కావడంతో ధరలు దారుణంగా పతనమయ్యాయి. పుట్టి ధాన్యం మీద రైతులు రూ.6,500 నుంచి రూ.8 వేల వరకు నష్టపోయారు. ఖరీఫ్‌ సీజన్‌లో మద్దతు ధర ను నామమాత్రంగా పెంచింది. ఆ ప్రకారం చూస్తే ఏగ్రేడ్‌ రకం క్వింటా రూ.2,389. ఈ లెక్కన పుట్టి ధా న్యం రూ.20,187 పలుకుతోంది. ప్రస్తుతం దిగుబడు లు జరుగుతున్న ప్రాంతంలో పుట్టి రూ.15 వేలకు మించి కొనడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు.

గోడౌన్ల దారిద్య్రం

జిల్లాలో ఏటా సగటున 48 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తుంటే.. ఆ స్థాయిలో నిల్వ చేసుకునే విధంగా ప్రభుత్వం గోడౌన్ల నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. వ్యవసాయశాఖ మార్కెట్‌ యార్డుల్లో ఉండే అరకొర గోడౌన్లు తప్ప..తెలుదేశం ప్రభుత్వం గతంలో కానీ, ప్రస్తుతం కానీ ఆ ఊసే ఎత్తడం లేదు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో 69 గోడౌన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గత ఎన్నికల సమాయానికి సగం గోడౌన్లు నిర్మాణం పూర్తికాగా, మిగతా వివిధ దశల్లో ఉన్నాయి. అందులోకి వచ్చిన వాటిని చివరి పనులు పూర్తి చేసి రైతులకు అందించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.

పొగాకు, ఉద్యాన పంటలదీ అదే దారి..

జిల్లాలో పొగాకుతోపాటు ఉద్యాన పంటలైన సపోటా, మామిడి, బత్తాయి, బొప్పాయి ధరలు దారుణంగా పతనమయ్యాయి. పొగాకు వైఎస్సార్‌సీపీ పాలనలో కేజీ రూ.360, ఈ ఏడాది కూటమి ప్రభుత్వంలో రూ.280 అమ్ముకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో పొగాకు ధరలను కొనుగోలుదారులు తగ్గిస్తే.. ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి పోటీ పెంచి ధరలు పెరిగేలా చేసింది. ఇక సపోటా రకం అయితే గతంలో 40 కేజీల బస్తా రూ.1,200 నుంచి రూ.1,300 వరకు విక్రయిస్తే.. అదే బస్తా కూటమి పాలనలో రూ.550 నుంచి రూ.750లకే కొనుగోలు చేస్తున్నారు. మామిడి అయితే గతంలో కేజీ రూ.35ల వరకు పలికితే.. కూటమి వచ్చాక రూ.2లకే పతనమైన విషయం అందరికీ తెలిసిందే. బొప్పాయి కేజీ గతంలో రూ.30ల వరకు ఉంటే.. ప్రస్తుతం రూ.5లకు కూడా కొనే పరిస్తితి లేదు. బత్తాయి మార్కెట్లో కేజీ రూ.30 అమ్ముతుంటే. రైతుల నుంచి రూ.7 నుంచి రూ.9లకే కొనుగోలు చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ పాలనలో ఊరి ముంగిటే సేవలు..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం ఏ రోజూ ఇబ్బంది పడలేదు. జిల్లాలో ఏ సీజన్‌లో ఎంత విస్తీర్ణంలో వరి సాగు జరుగుతుందో అంచనాలు వేసి ముందునే విత్తనాలను, అవసరమైన అన్ని ఎరువులను సిద్ధంగా ఉండేలా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించింది. రైతులకు సబ్సిడీ ధరలో అవసరమైన మేరకు ల్యాబ్‌ల్లో టెస్టింగ్‌ చేసి మరీ నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) సరఫరా చేశారు. ఆ ప్రభుత్వం పాలనలో ఏనాడు విత్తనాలు, ఎరువలకు రోడ్డెక్కిన చరిత్ర లేదు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాతల పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత ప్రభుత్వం మాదిరిగా విత్తనాలు, ఎరువులు సిద్ధం చేయకపోవడంతో రైతుల పాలిట శాపంగా మారితే.. బ్లాక్‌ మార్కెట్‌ వ్యాపారుల పాలిట వరంగా మారింది. జిల్లాలో రబీ సీజన్‌లో 9 లక్షల ఎకరాల వరి సాగుకు 1.08 లక్షల మెట్రిక్‌ టన్నులు, ఖరీఫ్‌ సీజన్‌లో 5 లక్షల ఎకరాలకు 60 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉంది. అయితే వ్యవసాయశాఖ మాత్రం మా లెక్కల ప్రకారం 49 వేల మెట్రిక్‌ టన్నులు సరఫరా చేశామని చేతులెత్తేసింది. 

యూరియా ఒక్కటే కాకుండా మిగతా ఎరువుల పరిస్థితి అంతే. గత రబీ, ఖరీఫ్‌ సీజన్ల నుంచి రైతులు ఎరువుల కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. రబీ సీజన్‌లో రైతు సేవా కేంద్రాలకు కేటాయించిన ఎరువులను మరో రైతుకు ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డదారిలోనే తరలించుకునిపోవడంతో రైతులు బ్లాక్‌ ధరలకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన ఎరువులు అవసరమైన సమయంలో యూరియా కొరత పెరిగింది. జిల్లాకు కేటాయించిన యూరియాను అధికారులు ప్రైవేట్‌ వ్యాపారులకు కేటాయించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా అరకొరగా విక్రయించారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సా ర్‌సీపీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంగళవా రం జిల్లాలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదు ట రైతులతో కలిసి ‘అన్నదాత పోరు’ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగే రీతిలో ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు.

 

జిల్లాలో ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు సంబంధించి 10,300 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉంది. జిల్లా అధికారుల లెక్క ప్రకారం ప్రస్తుతానికి 2,471 మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు సాక్షాత్తు కలెక్టరే చెప్పారు. ప్రస్తుతం మెట్ట మండలాల్లో లేట్‌ ఖరీఫ్‌ కింద సుమారు 70 వేల ఎకరాల్లో వరి నాట్లు ఇప్పుడిప్పడే ప్రారంభమయ్యాయి. ఇక ఉద్యాన శాఖకు సంబంధించి 75,457 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు జరుగుతోంది. వరికి సంబంధించి 8,400 మెట్రిక్‌ టన్నులు, ఉద్యాన పంటలకు సంబంధించి 1,900 మెట్రిక్‌ టన్నులు యూరియా అవసరం ఉంది. అయితే ప్రస్తుతం ఎరువుల కొరత లేదంటూనే అధికధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు చేస్తున్నారు. ప్రస్తుతం యూరియా బస్తా రూ.266 ధర ఉండగా ప్రైవేట్‌ వ్యాపారులు రూ.500 నుంచి రూ.550 వరకు విక్రయిస్తున్నారు. ఇక రైతు సేవాకేంద్రాల్లో కూడా రూ.290 నుంచి రూ.300లకు విక్రయిస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని దుకాణాల్లో అయితే యూరియా కావాలంటే.. కచ్చితంగా పురుగు మందు కొనాలని కండీషన్‌ పెడుతున్నారు.

ఎక్కడా కోల్డ్‌ స్టోరేజీలు లేవు
జిల్లాలో పండ్ల తోటలు 63,057, కూరగాయలు 4,059, పాంటేషన్‌ 5,339, సుగంధ ద్రవ్యాలు 2,677, పూలతోటలు 326 మొత్తం 75,457 ఎకరాల్లో రైతులు ఉద్యాన పంటలు పండిస్తున్నారు. పొగాకు 9,973 హెక్టార్లు పండిస్తున్నారు. వీటిని నాణ్యత దెబ్బతినుకుండా, మార్కెట్‌ ధరలు పెరిగే వరకు నిల్వ చేసుకునేందుకు జిల్లాలో ఎక్కడా కోల్డ్‌ స్టోరేజీలు లేవు. దీంతో నిల్వ చేసుకునే అవకాశం లేక రైతులు పండించిన పంటలను దళారులు అడిగిన ధరలకే విక్రయించుకుంటూ నష్టపోతున్నారు. వర్షం పడితే రైతు రక్తం చెమటలతో పండించిన పంట క్షణాల్లో మట్టిలో కలుస్తోంది. ఆరబెట్టే ప్లాట్‌ఫారాల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అన్నదాతలపై ఎందుకింత నిర్లక్ష్యం.

జిల్లాలో యూరియా అవసరమే లేదా?1
1/2

అన్నదాతల ఆక్రందనలు..

జిల్లాలో యూరియా అవసరమే లేదా?2
2/2

అన్నదాతల ఆక్రందనలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement