
పామాయిల్ దొంగ టీడీపీ నేతేనా!
● ఆ పార్టీ కీలక నేత రాజేంద్ర అరెస్ట్‌తో వాస్తవాలు బట్టబయలు
● రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు మౌనం.. తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పంటపాళెంలోని ఫ్యాక్టరీల నుంచి తరలించే పామాయిల్ ట్యాంకర్లల్లో ఆయిల్‌ను మరో వాహనంలోకి మార్చేసి ఆ వాహనానికి ప్రమాదంగా చిత్రీకరించి ఇటు సొమ్ము చేసుకుంటూ అటు ఇన్స్యూరెస్స్ పొందుతున్న గజదొంగ వెంకటాచలం వడ్డిపాళేనికి చెందిన టీడీపీ నేత రాజేంద్రే అని శనివారం పోలీసుల అరెస్ట్‌తో స్పష్టమైంది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డితో రాజేంద్రకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. టీడీపీ నేరచరితులను పెంచి పోషిస్తోందనే దానికి రాజేంద్ర ఉదంతమే ఉదాహరణగా నిలుస్తోంది. నాలుగు నెలల క్రితం జరిగిన ఈ కేసుకు సంబంధించి పాత్రధారి, సూత్రధారిని తప్పించిన పోలీసులు మిగతా వ్యక్తులను అరెస్ట్ చూపారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ముత్తుకూరు పోలీసులు రాజకీయ ఒత్తిళ్లను పక్కన బెట్టి టీడీపీ నేతగా చెలామణి అవుతున్న రాజేంద్రను అరెస్ట్ చేయడంతో సర్వేపల్లి నియోజకవర్గంలో చర్చానీయాంశమైంది.
ఆయిల్ కాజేసీ.. ప్రమాదంగా చిత్రీకరించి..
సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రం వెంకటాచలం వడ్డిపాళెం పంచాయతీకి చెందిన రాజేంద్ర ఏప్రిల్‌లో ముత్తుకూరు మండలం పంటపాళెం ఫ్యాక్టరీ నుంచి సుమారు 24 టన్నుల పామాయిలతో బయటకు వచ్చిన ట్యాంకర్‌ను డ్రైవర్, మరి కొందరితో కలిసి వెంకటాచలం మండలం నాయుడుపాళెం సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి మరొక ట్యాంకర్‌లోకి పామాయిల్ మార్చేశారు. ఆ పామాయిల్‌ను పిడుగురాళ్లకు తరలించి, అక్కడి ఓ వ్యాపారికి అమ్మకాలు చేసి సొమ్మును వాటాలుగా పంచుకున్నారు. అయితే ఖాళీ ట్యాంకర్‌ను మనుబోలు మండలం కొమ్మలపూడి సమీపంలోని పంట కాలువలో జేసీబీతో పడేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ కేసులో పాత్రధారి, సూత్రధారి టీడీపీ నేత రాజేంద్రేనని ప్రచారం జరిగింది. అయితే రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు రాజేంద్రను తప్పించి ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ముత్తుకూరు పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ నేత రాజేంద్రను శనివారం అరెస్ట్ చేశారు.
శ్రీకాంత్‌తోనూ రాజేంద్రకు సంబంధాలు
హత్య కేసులో జీవిత ఖైదీగా ఉన్న శ్రీకాంత్‌తో టీడీపీ నేత రాజేంద్రకు సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య సమస్యల పేరుతో జైలు నుంచి తిరుపతి రూయా ఆస్పత్రికి వెళ్లే ప్రతిసారి వెంకటాచలం పంచాయతీ వడ్డిపాళెంలో రాజేంద్రను కలిసి వెళ్తుండేవాడని ప్రచారం జరుగుతోంది. గతేడాది వడ్డిపాళెంలో జరిగిన వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా రాజేంద్ర ఆహ్వానించడంతో శ్రీకాంత్ వడ్డిపాళెం వచ్చి వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అదే విధంగా మరో రౌడీషీటర్ జగదీష్‌తోనూ రాజేంద్రకు మంచి పరిచయాలు ఉన్నాయని బయటపడటంతో పోలీసులు వీటన్నింటిపై విచారణ జరుపుతున్నారు.

పామాయిల్ దొంగ టీడీపీ నేతేనా!