చివరి శ్వాస.. ఆశ | - | Sakshi
Sakshi News home page

చివరి శ్వాస.. ఆశ

Sep 8 2025 4:46 AM | Updated on Sep 8 2025 4:46 AM

చివరి శ్వాస.. ఆశ

చివరి శ్వాస.. ఆశ

కోవూరు: మండలంలోని పడుగుపాడుకు చెందిన కొప్పల సుధాకర్‌, రాధిక దంపతుల పెద్ద కుమార్తె సుదీప్తి. బిడ్డ చివరి శ్వాసను చివరి వరకు నిలబెట్టుకునేందుకు ఆ తల్లిదండ్రులకు ఆర్థిక స్థోమత సరిపోగా, దాతృత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రాణాపాయం తప్పించాలంటే గుండె, ఊపిరితిత్తులు మార్పిడి శస్త్రచికిత్స తప్పదని వైద్యులు స్పష్టం చేశారు. చైన్నెలోని నిపుణులు సుదీప్తి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి.. తక్షణమే ఈ శస్త్రచికిత్స జరగాలని, దానికి సుమారు రూ.70 లక్షల ఖర్చవుతుందని వెల్లడించారు. కానీ సుదీప్తిది పేద కుటుంబం కావడంతో అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చే స్థోమత లేక తీవ్ర ఆందోళనలో ఉంది. పాప ప్రాణం కాపాడేందుకు ఆప్తులు, బంధువులు, గ్రామస్తులు వీలైనంతగా తోడ్పడుతున్నా.. అవసరమైన నిధులు సమకూర్చుకోవడం అది జీవిత స్వప్నంగా మిగిలిపోతుందని కుమిలికుమిలిపోతున్నారు. మనసున్న దాతలు ముందుకొచ్చి తమ బిడ్డ ప్రాణాన్ని కాపాడాలని కోరుతూ ఆ కుటుంబం కొంగుచాచి చివరి ఆశగా ఎదురు చూస్తోంది.

కన్నీటిలో తడిసిన కలల గాధ

సుదీప్తి చిన్ననాటి నుంచే గుండె, ఊపిరితిత్తులు సమస్యలతో బాధపడుతోంది. 2016–18 మధ్య కాలంలోనే వైద్యులు అనేక పరీక్షలు నిర్వహించి మార్పిడి శస్త్ర చికిత్స తప్పదంటూ స్పష్టం చేశారు. ఆ సమయంలో అనేక ఆస్పత్రులు చుట్టూ తిరిగినా ఉపయోగం లేకపోయింది. అప్పటి నుంచి సుదీప్తికి అనారోగ్యమే నిత్యసహచరిగా మారింది. రోజు రోజుకు అంతకంతకు పెరుగుతున్న ఆరోగ్య సమస్యలను సైతం లెక్క చేయకుండా చదువుపై ఆసక్తిని వదలని సుదీప్తి, తన కష్టాన్ని, నొప్పిని దాచుకుంటూ విద్యలో రాణించింది. మొదట 10వ తరగతి పూర్తి చేసి, తర్వాత ఉన్నత చదువులు కొనసాగిస్తూ చివరకు ఎంబీఏ పూర్తి చేసింది. ప్రతి అడుగులో ఆమెను శరీర బాధ, ఆర్థిక ఇబ్బందులు అడ్డుకున్నా.. ధైర్యాన్ని మాత్రం వదల్లేదు. కుమార్తె ప్రాణాల కోసం తల్లిదండ్రులు అప్పులు చేసి రూ.లక్షల ఖర్చు చేశారు. చైన్నె కంచికామకోటి ఆస్పత్రుల్లో, తర్వాత ఎంజీఎం వైద్యుల వద్ద అన్ని రకాల పరీక్షలు చేశారు. తాజాగా గుండె, ఊపిరితిత్తులు మార్పిడి శస్త్రచికిత్స తప్ప వేరే మార్గం లేదని వైద్యులు తేల్చి చెప్పారు.

రూ.70 లక్షలు..

దాతల కోసం ఎదురుచూపులు

ఈ శస్త్రచికిత్స కోసం సుమారు రూ. 70 లక్షల ఖర్చవుతుంది. ఇప్పటికే వైద్యానికి రూ.లక్షల్లో అప్పలు చేసినా ఆ తల్లిదండ్రులకు అంత మొత్తం సమకూర్చుకోవడం సాధ్యం కాని పని. ఓ పక్క బిడ్డ ప్రాణాలు చివరి దశలో ఉన్నాయి. దాతృత్వం చివరి ఆశగా తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. మనస్సున్న దాతలు సాయం అందించేందుకు సుదీప్తి తల్లి రాధికను 9848923921 నంబరులో సంప్రదించవచ్చు. బ్యాంక్‌ ద్వారా సాయం చేయాలనుకుంటే కెనరా బ్యాంక్‌, కోవూరు బ్రాంచ్‌లోని ఖాతా నంబర్‌ : 110055071311, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ యూబీఐఎన్‌0803332.

దాతృత్వం.. నిలిపేను సుదీప్తి ప్రాణం

గుండె, ఊపిరితిత్తులు

మార్పిడి శస్త్రచికిత్స అవసరం

రూ.70 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు స్పష్టం

అనారోగ్యంలోనూ ఎంబీఏ వరకు చదివిన పేదింటి విద్యా కుసుమం

పసిప్రాయం నుంచే ప్రాణాపాయం. గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో సతమతమైనా క్షణక్షణం.. శ్వాస కోసమే యుద్ధం చేస్తూ ఎదిగింది. చదువుతో తన జీవితానికి వెలుగుల ఆశలు రాసుకుంది. శరీరం శల్యమవుతున్నా.. మొక్కవోని లక్ష్యంతో ఉన్నత విద్యలో జయకేతనం ఎగురవేసిన ధైర్యవంతురాలు సుదీప్తి. కానీ ఇప్పుడు ఆమె జీవితం చివరి ఊపిరి దూరంలో నిలిచిపోయింది. గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స తప్ప మరో మార్గం లేదని వైద్యులు స్పష్టం చేశారు. కుమార్తె ఊపిరి నిలిపేందుకు చేసిన రుణాలతో నలిగిన తల్లిదండ్రుల బాధను దాచుకుని, కన్నీళ్లను మింగుకుని జీవచ్ఛంలా బతుకుతూ ఇప్పుడు ప్రాణం పణంగా పెట్టుకుంది. వైద్యానికి అవసరమైన రూ.లక్షలు సుదూర స్వప్నంగా మారింది. ఆపదలో ఉన్న తల్లిదండ్రుల మనోవేదన ఒక్కటే.. మనసున్న హృదయాలు కదలకపోతే తన కుమార్తె చివరి శ్వాస ఆగిపోతుందని, దాతృత్వం తోడ్పాటే జీవం పోస్తుందని ఆ తల్లిదండ్రుల చివరి ఆశ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement